సాక్షి,చిత్తూరు అర్బన్: పది రూపాయలకు ఏమొస్తుందని అడిగితే టీ కూడా రాదంటారు. కానీ రూ.10 ఇస్తే మూడు ఎక్స్‌ఎల్ సబ్బులతోపాటు స్కూటీ, బంగారు గొలుసు కూడా వస్తుందని మభ్యపెట్టి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బులు పోగొట్టుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. చిత్తూరు టూటౌన్ పోలీసులు గురువారం ఈ తరహా ఘటనలపై రెండు కేసులు నమోదుచేశారు. ఎస్‌ఐ మల్లికార్జున కథనం మేరకు.. గతనెల 21న చిత్తూరు నగరంలోని పెద్ద దళితవాడకులో టైలరింగ్ చేస్తూ జీవనం సాగించే నవీన ఇంటి వద్దకు ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. రూ.10 ఇస్తే బట్టలు ఉతికే మూడు సబ్బులు ఇస్తామని, ఓ సబ్బులో లక్కీ కాయిన్ ఉంటుందని.. దీనికి బహుమతి ఇస్తామని చెప్పారు.
నవీన రూ.10తో మూడు సబ్బులు కొంటే అందులో ఓ లక్కీ కాయిన్ వచ్చింది. రూ.5500 వేలు విలువచేసే కుక్కర్, కడాయి, హాట్‌బాక్స్, వెజిటేబుల్ కట్టర్, కడాయిను రూ.3700కు ఇస్తామని చెప్పడంతో అంతమొత్తం చెల్లించి నవీన ఆ వస్తువులను తీసుకుంది. ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న వ్యక్తులు వెళ్లిపోయారు. తక్కువ ధరకే విలువైన వస్తువులు రావడంతో యువతి తెగ ఆనందపడిపోయింది. మూడు రోజుల తరువాత ఓ వ్యక్తి ఫోన్ చేసి తాము సబ్బులు విక్రయించినవారిమేనని చెప్పి, మళ్లీ లక్కీడిప్ తీస్తే రూ.లక్ష విలువ చేసే స్కూటీ, ఓ బంగారు గొలుసు వచ్చిందన్నాడు.
దీనికిగానూ రూ.27,700 చెల్లించాలని చెప్పడంతో నిందితులు చెప్పిన బ్యాంకు ఖాతాలో ఆ మొత్తం నవీన జమచేసింది. తరువాత నిందితులు సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేశారు. ఇదేతరహాలో గతనెల 22న లెనిన్ నగర్‌కు చెందిన దిలీప్‌ను మోసం చేసి రూ.18,650 బ్యాంకు ఖాతాలో వేయించుకున్నారు. దీనిపై ఎవరికైనా చెబితే పురువుపోతుందని బాధితులు మొదట్లో భావించినా, తనలా ఎవరూ మోసపోకూడదని పోలీసులను ఆశ్రయించారు. రెండు ఘటనలపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment