
..అదే నిర్లక్ష్యం
‘విద్యార్థులంటే ఆర్టీసీ వారికి చిన్నచూపు. వారు పాస్‌పై ప్రయూణించే వారు.
జిల్లాలో అనేక సర్వీసుల్లో టాప్ ప్రయాణం
డొక్కు బస్సులతో దినదినగండం
పట్టించుకోని అధికారులు, {పజాప్రతినిధులు
‘విద్యార్థులంటే ఆర్టీసీ వారికి చిన్నచూపు. వారు పాస్‌పై ప్రయూణించే వారు. వారి వల్ల పెద్దగా ఆదాయం రాదనే భావన. అందుకే పలు రూట్లలో బస్సులు ఆపకుండా వెళ్లడం మామూలైపోరుుంది. బడికి వెళ్లక తప్పదు కాబట్టి ఒక్కో ఆటోపై పాతిక మందిమి వెళ్తున్నాం. ఏదో దారితప్పి వచ్చినట్లు ఒక బస్సు వస్తే టాప్‌పైకి ఎక్కక తప్పడం లేదు. అసలే గతుకుల రోడ్లు.. ఆపై మలుపులు. ఎప్పుడేం జరుగుతుందోనని రోజూ భయమే’ అంటూ రోజూ వివిధ రూట్లలో ప్రయూణించే విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం క్రైం : పెనుకొండ వద్ద బుధవారం జరిగిన బస్సు ప్రమాదం 15 నిండు ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రోడ్లు, బస్సుల భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయి. కాలం చెల్లిన బస్సులు నడుపుతూ ఆర్టీసీ అధికారులు, తనిఖీలు చేయడంలో నిర్లిప్తంగా ఉన్న ఆర్టీఏ అధికారుల తీరుతో ప్రయూణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. రోడ్లపై వంతెనల వద్ద రక్షణ గోడలు నిర్మించాల్సిన ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు. కలెక్షన్లు తగ్గాయనే కారణంతో ఆర్టీసీ అధికారులు ఒకట్రెండు సర్వీసులు మాత్రమే ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు. ప్రమాదమని తెలిసినా టాప్ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. డొక్కు బస్సులతో ప్రయాణికులు దినదినగండంగా గడుపుతున్నారు. పెనుకొండ ఘటన నేపథ్యంలో రోడ్లు, నిర్మాణ ప్రాంతాల్లో రక్షణ చర్యలు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, ఆర్టీసీ సర్వీసులు, విద్యార్థుల అవస్థలను ‘సాక్షి’ పరిశీలించగా.. పలు వాస్తవాలు వెలుగు చూశాయి.
వందకు పైగా కాలం చెల్లిన బస్సులు
మోటార్ వెహికల్ నిబంధనల ప్రకారం ఆరున్నర లక్షల కిలోమీటర్లు తిరిగిన వాహనాలను పక్కన పెట్టాలి. ఆర్టీసీ మాత్రం అనంతపురం రీజియన్‌లో నిబంధనలకు తిలోదకాలిస్తోంది. గ్రామాలకు మంచి కండీషన్ ఉన్న బస్సులు పంపడం లేదు. 10-15 లక్షల కిలోమీటర్లు తిరిగిన వాటిని తిప్పుతున్నారు. అవి ఎక్కడపడితే అక్కడ చెడిపోతున్నాయి. ‘అందుబాటులో ఉన్న వాటిని పంపుతాం.. సంస్థ నష్టాల్లో ఉందం’టూ ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. నార్పల, రాచేపల్లి, ఉరవకొండ తదితర ప్రాంతాలకు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కనీసం 2-3 బస్సులు అందుబాటులో ఉండాలి. పాస్‌లతో విద్యార్థులు వెళ్తున్నారనే కారణంతో ఒకే ఒక బస్సు నడుపుతున్నారు.
చర్యలేవీ?
రోడ్డు రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ వాహనాల తనిఖీల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అదే ప్రభుత్వ వాహనాలపై శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు చాలానే తిరుగుతున్నాయి. దీనికితోడు రహదారులపై రేడియం స్టిక్కర్లు ఎక్కడా కనిపించడం లేదు. రోడ్ల నిర్మాణాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయకుండానే పనులు చేపడుతున్నారు.
మృత్యు మార్గాలివీ..
ధర్మవరం మండల పరిధిలోని నేలకోట, బిల్వంపల్లి, బుడ్డారెడ్డిపల్లి, ఏలుకుంట్ల మీదుగా కృష్ణాపురం వెళ్లే రహదారి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఈ రహదారి కొండ ప్రాంతాల్లో మలుపులు తిరుగుతూ వెళుతుంది. వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఎత్తయిన ప్రదేశం నుంచి ఒక్క సారిగా లోతట్టు ప్రదేశంలోకి వాహనాలు వెళుతుంటాయి. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గుత్తి-నాగసముద్రం, గుత్తి-పత్తికొండ రహదారిపై అబ్బేదొడ్డి క్రాస్, బసినేపల్లి పెద్ద వంక వద్ద కల్వర్టులకు రక్షణ గోడలు లేవు. ఈ రహదారులపై నిత్యం వందలాది ఆటోలు, లారీలు, బస్సులు తిరుగుతుంటాయి. కల్వర్టులు ఇరుకుగా ఉండటంతో రెండు వాహనాలు ఒకేసారి వచ్చిన సమయంలో డ్రైవర్లకు కనిపించక వాహనాలు కల్వర్టు కిందకు ఒరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి.
అమరాపురం మండలం బసవనపల్లి చెరువు కట్ట (ఆర్‌అండ్‌బీ రోడ్డు)పై నిత్యం వాహనాలు తిరుగుతుంటాయి. కట్టపై రోడ్డును ఆర్‌అండ్‌బీ అధికారులు విస్తరిస్తున్నారు. అయితే.. ఎక్కడా హెచ్చరిక బోర్డులు పెట్టలేదు. గతంలో ఇక్కడ ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. మడకశిర పట్టణ సమీపంలోని అక్కంపల్లి వద్దకూడా రోడ్డుకు ఆనుకుని బావులున్నాయి. వీటి వద్ద రక్షణ గోడలను నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పెనుకొండ మండలం గోనిపేట రహదారిలో కల్వర్ట్ వద్ద ప్రమాదం పొంచివుంది. రక్షణ గోడలు నిర్మించకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తోంది. బుక్కపట్నం-కొత్తచెరువు ప్రధాన రహదారి సుమారు 4 కిలోమీటర్ల మేర ఇరుకైన చెరువుకట్టపై ఉంది. ఈ దారిలో ఏ ఒక్కచోటా ప్రమాద సూచికలు లేవు. ప్రమాదం జరిగితే చెరువుకు ఇరువైపులా 40 అడుగుల లోతుకు పడిపోవడం ఖాయం. బుక్కరాయల కాలంలో కట్టిన ఈ పురాతన చెరువుపై రహదారిని విస్తరించటంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారు.
కళ్యాణదుర్గం నుంచి బ్రహ్మసముద్రం మం డలం పొబ్బర్లపల్లి, పిల్లలపల్లి, కం బ దూరు మండలం నూతిమడుగు, పాళ్లూరు, కంబ దూరు, కుందుర్పి మండలం జంబుగుం పల, బెళుగుప్ప మండలం గంగవరం, దుద్దేకుంట, అంకంపల్లి గ్రామాలకు రాకపోకలు సాగించే విద్యార్థులు, ప్రయాణికులు నిత్యం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళ్లాల్సివస్తోంది. బస్సు సౌకర్యాలు అరకొరగా ఉండడంతో కిక్కిరిసి వెళుతున్నారు.
పుట్లూరు నుంచి గరుగుచింతలపల్లి వెళ్లే దారిలో పుట్లూరు చెరువు వద్ద ప్రమాదం పొంచివుంది. వడ్డెర కాలనీ వద్ద రోడ్డు పక్కనే 50 అడుగుల లోతు కాలువ ఉంది. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు. పెద్దవడుగూరు మండలం ఆవులాంపల్లి,పెద్దవడుగూరు, మేడిమాకులపల్లి వద్ద ఉన్న బ్రిడ్జీలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆవులాంపల్లి, గుత్తి అనంతపురం సమీపంలోని బ్రిడ్జిల వద్ద వర్షపు నీరు వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దవడుగూరు పెద్ద వంకపై నిర్మించిన బ్రిడ్జి కూడా శిథిలావస్థకు చేరుకొంది.
కర్నూలు జిల్లా బూరుగుల నుంచి మండల కేంద్రం యాడికికి వచ్చే విద్యార్థులు ఘాట్ రోడ్డులో కూడా ఒక ఆటోలో 25 మంది దాకా ప్రయాణిస్తున్నారు. గురువారం స్థానిక ఏఐఎస్‌ఎఫ్ నాయకులు 25 మందికి పైగా ప్రయాణిస్తున్న ఆటోను అడ్డుకున్నారు.
అనంతపురం-బళ్లారి రోడ్డులోని పెన్నహోబిలం వద్ద భారీ వంతెన శిథిలావస్థకు చేరింది. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలతో పాటు భారీ ట్రక్కులు వెళుతుంటారుు. వంతెన ఇరువైపులా సైడ్‌వాల్స్ కూలడంతో ప్రమాదాలు జరిగే అవకాశముంది.