బాబును భరించరు
► నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
► జగనన్నే ముఖ్యమంత్రి : నగర ఎమ్మెల్యే అనిల్
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): రోజురోజుకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వ్యతిరేకత పెరిగిపోతోందని, ప్రజలు ఆయనను భరించే పరిస్థితుల్లో లేరని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని ఎంసీఎస్ కల్యాణ మండపంలో సోమవారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో చేసిన ఏ వాగ్దానాన్నీ నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్న బాబుపై వస్తున్న వ్యతిరేకతను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు క్యాష్ చేసుకోవాలన్నారు.
బాబు పదవి చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో కరువు తాండవిస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులన్నీ జలకళతో కళకళలాడాయన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి డూ ఆర్ డై అని, యుద్ధ స్ఫూర్తితో పోరాడాలన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం, డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్ నగర శాసనసభ్యుడిగా ఎన్నికవడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు.
రాయలసీమలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నెల్లూరులోని 10 నియోజకవర్గాలతోపాటు రెండు ఎంపీ స్థానాల్లో అత్యధిక మెజార్టీ తీసుకురావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను మేకపాటి తప్పుబట్టారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న వారిపై గెలిచి తీరా ల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఉందని ఎంపీ అన్నారు.
బాబు గొప్ప మాయావి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు గుర్తింపునిచ్చిన మామ ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి ఇప్పటివరకు మాయమాటలతో మభ్యపెడుతున్న గొప్ప మాయావి అని మేకపాటి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. బాబు మీద ఉభయగోదావరి జిల్లాల్లో సైతం వ్యతిరేకత ఏర్పడిందన్నారు. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయడం ప్రధానమంత్రి మోదీకి ససేమిరా ఇష్టంలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం రాజకీయ కారణాలతో కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడిపోయారని చెప్పారు.
కష్టాల్లో ధైర్యం ఇచ్చేవారే సైనికులు
నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీరదన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పే వారే అసలైన సైనికులన్నారు. గత ఎన్నికల్లోనే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సి ఉందని, అయితే మరింత కాలం ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాల్లో అనుభవం సాధించేందుకే భగవంతుడు ప్రతిపక్షనాయకుడిగా అవకాశం ఇచ్చాడేమోనని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయమని, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిలాగా మెరుగైన పాలన జగనన్న అందిస్తారని అభిప్రాయపడ్డారు.
తమ నాయకుడు జగన్‌కు, లోకేష్‌కు హీరోకు, కామెడీ యాక్టర్‌కు మధ్య ఉన్నంత తేడా ఉందన్నారు. జగనన్న సీఎం కావాలన్నదే తన మొట్టమొదటి మొక్కు అని తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని బలోపేతం చేస్తామన్నారు. డివిజన్ వారీగా, బూత్‌ల వారీగా కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. డెప్యూటీ మేయర్ ద్వారకనాథ్ మాట్లాడుతూ సొంత నిధులతో నగర ప్రజల సమస్యలుS పరిష్కరించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే వెంటే కార్యకర్తలు ఉంటారన్నారు.
కాగా, నెల్లూరులోని 16వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జి పుదుచేరి సతీష్‌కుమార్‌యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు గజమాలతో సన్మానించారు. కార్పొరేషన్ వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ రూప్‌కుమార్‌యాదవ్ అధ్యక్షత వహించిన ఈ సభలో కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్ అహ్మద్, దేవరకొండ అశోక్, నాయకులు వేలూరు మహేష్, కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగ, కొణిదెల సుధీర్, దార్ల వెంకటేశ్వర్లు, ప్రతాప్‌రెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, మునీర్‌సిద్దిక్, శ్రీనివాసులు, శ్రీహరిరాయల్, వెంకటేశ్వర్లురెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, మురళీకృష్ణ, ఇంతియాజ్, జెస్సీ, సురేష్, ఫయాజ్‌ఖాన్, సుధీర్‌బాబు, శ్రీనివాసులురెడ్డి, మున్వర్, వెంకటరెడ్డి పాల్గొన్నారు.