
సాక్షి, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోర్టులు రాకపోవడానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రెండు పోర్టులు ఇస్తామన్నా చంద్రబాబు స్పందించడం లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే రామయ్యపట్నం పోర్టు వస్తుందని పేర్కొన్నారు. దుగ్గరాజుపట్నం, రామయ్యపట్నం పోర్టులకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.
దుగ్గరాజుపట్నంలో కొన్ని సమస్యలున్నా..రామయ్యపట్నం అన్నివిధాలా అనుకూలంగా ఉందని తెలిపారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. తన అనుకూల మీడియా ద్వారా వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తానని చెప్పినా కమీషన్ల కోసమే చంద్రబాబు తీసుకున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ కట్టి..ప్రజలకు అంకితం చేశానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి బాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment