వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను నీరుగార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను చంద్రబాబు మరిచిపోయారని అన్నారు. రాష్ట్ర విభజనకు లేఖరాసి చంద్రబాబు కారణమయ్యారని తెలిపారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విభజన సమయంలో పోలవరం, హోదా, రైల్వేజోన్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, వైఎస్సార్ జిల్లాకు ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం వంటి హామీలిచ్చి టీడీపీ, బీజేపీలు పట్టించుకోవటంలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటివరకు వైఎస్ జగన్ ఒకే మాటపై ఉన్నారని తెలిపారు. హోదా కోసం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు, పోరాటాలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు.
వైఎస్సార్ సీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో ఏం సాధించారో చూశామని.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఏం సాధిస్తారో చూద్దామని ఎద్దేవా చేశారు. యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడులను విభజించకుండా ఏపీని పనిగట్టుకుని కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా విభజించాయని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీలు చాలా వాగ్దానాలు చేసి మోసం చేశాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment