‘బీ సేఫ్’ యాప్‌ను ఆవిష్కరిస్తున్న హోంమంత్రి సుచరిత. చిత్రంలో వాసిరెడ్డి పద్మ, వనిత, సవాంగ్ తదితరులు
లబ్బీపేట(విజయవాడ తూర్పు): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సమాజం పురోగతి సాధిస్తుండగా.. మహిళలు, యువత అదే టెక్నాలజీ బారినపడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తుతోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. టెక్నాలజీని అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఏపీ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు.
మహిళలు, యువత రక్షణ కోసం ఉద్దేశించిన ‘బీ సేఫ్’ యాప్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేకతోటి సుచరిత మాట్లాడుతూ... అత్యవసర ఫోన్ నంబర్లు 100, 181, 112, వాట్సాప్ నంబరు 9121211100పై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని, మహిళామిత్ర, సైబర్‌మిత్ర ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఆపదలో ఉంటే పోలీసులను సంప్రదించాలి
సైబర్ నేరాలకు గురయ్యే వారిలో మహిళలు, యువతులు, ఉద్యోగినులు ఎక్కువగా ఉంటున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. ఇబ్బందికర పరిస్థితుల్లో అధైర్య పడకుండా అత్యవసర నంబర్ల ద్వారా పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... సైబర్ నేరాలు జరిగితే ఎలా స్పందించాలి, సమాజంలో ఎవరితో ఎలా మెలగాలనే దానిపై యువతులు అవగాహన పెంచుకోవాలని చెప్పారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ఆపద సమయంలో అత్యవసర ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదిస్తే పోలీస్ శాఖ వెంటనే స్పందిస్తుందన్నారు. కార్యక్రమంలో విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment