సాక్షి, అమరావతి: ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండ చోటుచేసుకున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. శాంతిభద్రతలపై శాసన మండలిలో శుక్రవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. సభ్యులు ప్రస్తావించిన పలు అంశాలపై మంత్రి సుచరిత బదులిచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తికాకుండానే నేరాలు, ఘోరాలు జరిగిపోయినట్టు గగ్గోలు పెడుతున్న టీడీపీ నేతలు గడిచిన ఐదేళ్లలో ఎన్ని దారుణాలు జరిగాయో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ‘శాంతిభద్రతల విషయంలో గట్టిగా ఉండాలని, పార్టీలు, రాజకీయాలు చూడొద్దని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి’ అని తనకు హోంమంత్రి పదవి అప్పగించినప్పుడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని సుచరిత వివరించారు. ఎన్నికల రోజున రాష్ట్రవ్యాప్తంగా 147 ఘటనలు జరిగాయని, అప్పుడు తాము అధికారంలో లేకపోయినా తమను నిందించడం సరికాదన్నారు. గడిచిన ఐదేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన నేరాలను గమనిస్తే రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందనే ఆందోళన కలుగుతోందని సుచరిత అన్నారు.
హత్యా రాజకీయాలకు బాబు ప్రోత్సాహం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిని చంపిన వారికి చంద్రబాబు నివాసంలో షెల్టర్ ఇవ్వలేదా? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. హత్యా రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహించారని ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, గోవిందరెడ్డి, జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో ఒక్క అనంతపురం జిల్లాలోనే 753 హత్యలు జరిగితే అందులో 383 మంది రెడ్లు హత్యకు గురైన విషయం టీడీపీ వాళ్లకు తెలియదా? అని నిలదీశారు. టీడీపీ సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్
అవాస్తవాలు మాట్లాడటం టీడీపీ సభ్యులకు అలవాటైపోయిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తప్పుబట్టారు. శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా టీడీపీ సభ్యులు బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్న, శమంతకమణి, పోతుల సునీత, దీపక్‌రెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, శాంతిభద్రతలు లేవని అన్నారు. మంత్రి సుచరిత సమాధానం చెప్పే సమయానికి వారు సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై మంత్రి సుభాష్ చంద్రబోస్ స్పందిస్తూ.. టీడీపీ సభ్యులు వాస్తవాలు వినకుండా ప్రభుత్వంపై బురద జల్లేందుకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఉందని విమర్శించారు.
మండలిలో రెండు బిల్లులు ఆమోదం
శాసన మండలిలో శుక్రవారం రెండు బిల్లులను ఆమోదించారు. ‘ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ లాస్–2019’ బిల్లును విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించగా సభ ఆమోదించింది. ‘ధార్మి, హిందూమత సంస్థలు, దేవదాయ చట్టం–1987 సవరణ బిల్లును దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment