అవినీతి చేసి.. నీతులా? | Minister Anil Yadav Fires On TDP In AP Assembly | Sakshi
Sakshi News home page

అవినీతి చేసి.. నీతులా?

Published Fri, Jul 19 2019 4:51 AM | Last Updated on Fri, Jul 19 2019 4:52 AM

Minister Anil Yadav Fires On TDP In AP Assembly  - Sakshi

సాక్షి, అమరావతి : సాగునీటి రంగాన్ని ఐదేళ్లుగా అవినీతిమయం చేసి, ఇప్పుడు నీతులు చెబితే ఎలా అని టీడీపీపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టుకైనా ప్రాధాన్యం ఇచ్చారా? అని ఆయన నిలదీశారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరాన్ని అవినీతి కేంద్రంగా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్ర శాసనసభలో గురువారం సాగునీటి ప్రాజెక్టుల పద్దుపై చర్చ జరిగింది. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 62 ప్రాజెక్టులకు డిజైన్‌ చేసిందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేసినట్టు చెప్పారు. కొత్త ప్రభుత్వం 45 రోజులైనా ప్రాజెక్టు కాంట్రాక్టులపై ఇంతవరకూ ఎలాంటి రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టలేదని విమర్శించారు.

ఈ దశలో అనిల్‌ మాట్లాడుతూ.. పోలవరం కాల్వలన్నీ వైఎస్‌ హయాంలోనే నిర్మించారని, టీడీపీ ప్రభుత్వం కేవలం కాఫర్‌డ్యాం నిర్మించి అన్నీ చేసినట్టు ప్రచారం చేసుకుందని విమర్శించారు. గేటు దగ్గర నిలబడి ఫొటోలకు ఫోజులివ్వడం, ప్రతీ సోమవారం కమీషన్‌ లెక్కలు చూసుకోవడమే చంద్రబాబు సాధించిన పురోగతి అని ఎద్దేవా చేశారు. పట్టిసీమ పేరుతో రూ.350 కోట్ల దోపిడీ జరిగిందని కాగ్‌ నివేదికే తేల్చిందన్నారు. తెలంగాణకు ఆస్తులన్నీ రాసిస్తున్నారని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తీవ్రంగా స్పందించారు. పక్క రాష్ట్రాలతో తమ ప్రభుత్వం సన్నిహితంగా మెలుగుతోందనే బాధ టీడీపీ నేతల్లో స్పష్టంగా కనబడుతోందన్నారు. హైదరాబాద్‌లోని భవనాలు ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నాయని, వాటికి మూడేళ్లుగా కరెంట్‌ బిల్లులు కూడా కట్టలేదని, వాటిని ఎవరో ఒకరు ఉపయోగించుకోవాలనే తెలంగాణకు ఇచ్చామని వివరించారు. ప్రతీదానికీ తెలంగాణతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చిందెవరని మండిపడ్డారు.

ప్రాజెక్టుల పూర్తికి సర్కారు కట్టుబడి ఉంది..
సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని చర్చలో పాల్గొన్న పలువురు వైఎస్సార్‌సీపీ సభ్యులు అన్నారు. తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చర్చను ప్రారంభిస్తూ.. ప్రాజెక్టులపై ఆ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని వసంత కృష్ణప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్‌ ఎలిజా మాట్లాడుతూ... రైతులకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. చింతలపూడి ప్రాజెక్టుకోసం పెద్దసంఖ్యలో నిధులు కేటాయించడాన్ని స్వాగతించారు. మాజీ మంత్రి నారాయణ నెల్లూరులో సాగునీటి కాల్వను ఆక్రమించి, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిన వైనాన్ని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. పోలవరం ముంపు గ్రామాల్లో రీ సర్వే జరిపించి బాధితులకు న్యాయం చేయాలని తెల్లం బాలరాజు కోరారు. గత ఐదేళ్లలో ప్రాజెక్టులకు ఎటువంటి మరమ్మతులు చేయకుండా టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement