⇒పెదగంగవరం గిరిజనేతరుల సమస్యపై ఏడాది క్రితం మంత్రి వాగ్దానం
⇒సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ఆస్కారం లేకపోవడంపై విస్మయం
⇒ఇప్పటికీ బాధితులు పశువుల పాకల్లో తలదాచుకుంటున్న వైనం
⇒ఏళ్ల తరబడీ పరిష్కారం కాని సమస్య
‘ఇలాంటి సమస్య దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా చూడ లేదు.. వినలేదు. కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నా, ఇన్ని హక్కులు ఉండి కూడా మీ భూముల్లో మీరు పక్కా ఇళ్లు నిర్మించు కోకుండా అడ్డుపడటం దారుణం.. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, అసెంబ్లీ దృష్టికి కూడా తీసుకె ళ్లి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తా.. అది కూడా నా హయాంలోనే పరిష్కారమయ్యేలా ప్రత్యేక చొరవ చూపుతా.. ఇటువంటి పరిస్థితి రావడం దారుణం’.. ఏడాది కిందట అనంతగిరి మండలం పెదగంగవరం గ్రామానికి చెందిన గిరిజనేతరుల సమస్య విన్న మంత్రి అయ్యన్న పాత్రుడి స్పందన ఇది.
దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ బుచ్చింపాలెం గ్రామంలో నిర్మించిన మినీ రిజర్వాయర్ ప్రారంభానికి పెదగంగవరం మీదుగా గత ఏడాది ఫిబ్రవరి 27న వచ్చిన మంత్రి అయ్యన్న పాత్రుడిని పెదగంగవరం గ్రామస్తులు అడ్డుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. అప్పటికి సుమారు నెల రోజులు క్రితం ఇళ్లు అగ్నికి ఆహుతై పశువుల పాకల్లో తలదాచుకుంటున్న గ్రామస్తుల దుస్థితిని చూసి మంత్రి అయ్యన్న చలించిపోయారు. సమస్య పరిష్కారం కోసం ఎంతవరకైనా వెళ్తానని.. పరిష్కరించే వరకు వెనుకాడేది లేదని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇది జరిగి ఏడాది దాటిపోయింది. మంత్రి గారిని గ్రామస్తులు కలుస్తూనే ఉన్నారు.. ఇప్పటికీ సమస్య అలాగే ఉంది.
దేవరాపల్లి: ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్య పరిష్కారానికి మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక దారి చూపిస్తారని పెదగంగవరం గ్రామస్తులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఏడాది కిందట మంత్రి గ్రామానికి వచ్చి అక్కడి గిరిజనేతరుల దుస్థితిని చూసి గ్రామ పెద్దలు ఫోన్ నంబర్లును తీసుకోవడంతో పాటు, తన ఫోన్ నంబర్‌ను కూడా గ్రామ పెద్దలకు ఇచ్చి తరుచూ కలు స్తూ ఉండాలని సూచించారు. అప్పటి నుండి గ్రామస్తులు పలుమార్లు మంత్రిని కలిశారు. మంత్రి హామీ ఇచ్చి ఏడాది గడిచినా పరిష్కార మార్గం కనిపించకపోవడంతో గ్రామస్తులు కలవరడుతున్నారు.
సమస్య ఇదీ.. అనంతగిరి మండలం పెదగంగవరం గిరిజన గ్రామంలో గిరిజనేతరులైన సుమారు 300 కుటుంబాలు గ్రామం ఏర్పడిన 1847 నుండి నివాసం ఉంటున్నారు. వీరు పూర్వీకుల నుండి సంక్రమించిన భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇక్కడి కొందరు గిరిజనులు, గిరిజన సంఘాల నాయుకులు 1/70 చట్టం ప్రకారం గిరిజనేతరులైన మీకు ఎటువంటి హక్కులు ఉండవని సమస్యను లేవెనెత్తడంతో అప్పటి నుండి గిరిజనులు, గిరిజనేతరుల మధ్య వివాదం నెలకొంది. దీనిపై గిరిజనేతరులు మాత్రం 1/70 చట్టం ప్రకారం 1963 ముందు కంటే గిరిజన ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనేతరులకు కూడా గిరిజనలతో సామాన హక్కులు ఉంటాయని, ఈ మేరకు 2/70 చట్టాన్ని జారీ చేశారని చెబుతున్నారు. దీని ప్రకారం తమకు గతంలో అధికారులు సెటిల్‌మెంట్ పట్టాలను, పాసు పుస్తకాలను, పట్టాదారు పుస్తకాలను జారీ చేశారని తెలిపారు.
పక్కా ఇళ్లకు నోచుకోని వైనం
గత ఏడాది జనవరి 17న గ్రామంలో గిరిజనేతరుల 29 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. జన్మభూమిలో ఇళ్లు మంజూరైనా గిరిజన సంఘాల నాయుకుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి అన్ని హక్కులు ఉన్న తమకు ఎల్‌పీసీలు ఇవ్వడం లేదని గిరిజనేతరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాజ్యం కోర్టు పరిధిలో ఉంది.
అన్నదమ్ముళ్లా ఉంటున్నాం..
గిరిజనులు, గిరిజనేతరులమైన తామంతా పూర్వీకుల నుండి అన్నదమ్ముళ్లా కలిసి మెలిసి ఉంటున్నాం.. కొందరు గిరిజన సంఘాల నాయకులు లేని సమస్యను సృష్టించి రాద్దాంతం చేస్తున్నారు.. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా పూర్తి భాద్యత ప్రభుత్వమే వహించాలి. చివరగా మంత్రి అయ్యన్నపైనే ఆశలు పెట్టుకున్నాం. ఆయన చొరవ తీసుకుంటే ఇచ్చిన హామీ మేరకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
- కె.వి.రమణ, శ్రీరామా నాన్ ట్రైబుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి, పెదగంగవరం
అన్ని పత్రాలు ఉన్నా హక్కు లేదంటున్నారు
నా చిన్న నాటి నుండి గ్రామంలో నివాసం ఉంటున్నాను. మా భూములకు పాసు పుస్తకాలతో పాటు అన్ని పత్రాలు ఉన్నా పక్కా ఇళ్ళు నిర్మించుకోకుండా అడ్డుకోవడం అన్యాయం. పూరిళ్లు కాలిపోయి ఏడాది దాటిపోతున్నా.. వాటి స్థానంలో పక్కా ఇళ్లతో పాటు స్వచ్ఛ భారత్ మరుగుదొడ్డు నిర్మించుకోకుండా అడ్డుకోవడం అత్యంత దారుణం. పశువుల పాకల్లో నివాసం ఉంటున్నాం. మేము బతికి ఉండగానే మంత్రి అయ్యన్న సమస్య పరిష్కరించాలి.
- కొట్టాన అచ్చన్న, గిరిజనేతర వృద్ధుడు.
అయ్యన్న మరిచిన అరణ్య రోదన!
Published Fri, Mar 4 2016 11:32 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement