
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు నగరాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దడానికి ఎంపిక చేసినట్టు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశంలో కాలుష్యం బారిన పడిన నగరాలను కాలుష్యరహితంగా మార్చేందుకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. 2011-2015 మధ్య కాలంలో దేశంలోని వివిధ నగరాల్లో వ్యాపించిన గాలి నాణ్యతకు సంబంధించిన డేటా ప్రతిపాదికన, ప్రపంచ బ్యాంక్ నివేదిక ఆధారంగా దేశంలోని 102 నగరాలు కాలుష్యం బారినపడినట్టు గుర్తించడం జరిగిందన్నారు. ఆ నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నగరాల్లో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన కార్యచరణ పథకాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆమోదించినట్టు చెప్పారు.
విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరుతోపాటు దేశంలోని 10 లక్షల జనాభా మించిన 28 నగరాల్లో వాయు కాలుష్యాన్ని అరికట్టి, పరిశుభ్రమైన గాలిని అందించేందుకు.. ఈ ఏడాది ప్రతి నగరానికి 10 కోట్ల రూపాయలను తమ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిందని తెలిపారు. అంతేకాకుండా కాలుష్యాన్ని అరికట్టేందుకు చేపట్టే చర్యలను ఆయన వివరించారు. కాలుష్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, యంత్ర పరికరాలను వినియోగించి వీధులను శుభ్రపరచడం, వాటర్ స్ప్రింక్లర్స్ వినియోగం, వాతావరణంలో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున మొక్కలు పెంపకం చేపడతామని తెలిపారు.
ఐఎస్‌ఎస్ విరాట్ ఇక తుక్కే..
భారత నౌక దళ సేవల నుంచి విశ్రమించిన ప్రతిష్టాత్మక విమాన వాహక యుద్ద నౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను తుక్కుగా మార్చాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించినట్టు ఆ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. 2017లో నౌకదళ సేవల నుంచి ఉపసంహరించిన ఐఎన్‌ఎస్ విరాట్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అందచేయడం లేదని చెప్పారు. యుద్ధ నౌకను అప్పగిస్తే ఆర్థికంగా దానిని ఏ విధంగా భరించగలమో వివరించే ప్రతిపాదన ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు అందలేదని స్పష్టం చేశారు. భద్రత, రక్షణ అంశాలను దృష్టిలో పెట్టుకుని.. నౌక దళ అధికారులతో చర్చించిన అనంతరం ఐఎన్‌ఎస్ విరాట్‌ను తుక్కుగా మర్చాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు.