ఆకాశంలో అద్భుతం !
ఆకాశంలో హరివిల్లు అనగానే... చల్లగాలి.. కమ్ముకొస్తున్న మేఘాలు... చిరుజల్లులు.. సూర్యకిరణాల ప్రసరణ.. వంటి సప్తవర్ణ సోయగాలు మనకు గుర్తుకొస్తాయి. ఇది సహజసిద్ధమైన ప్రకృతి దశ్యకావ్యం. అయితే అటువంటివేమీ లేకుండానే శుక్రవారం మధ్యాహ్నం భగభగ మండే సూర్యుని చుట్టూ హరివిల్లు ఏర్పడింది. మధ్యాహ్నం 12.02 గంటల సమయంలో ఆకాశంలో సూర్యుని చుట్టూ చక్రం ఆకారంలో హరివిల్లు కనిపించింది. సుమారు 28 నిమిషాలపాటు స్పష్టంగా కనిపించిన ఈ హరివిల్లు ప్రజలకు కనువిందు చేసింది.
విజయనగరం, గంట్యాడ, పార్వతీపురం ప్రాంతాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఎండతీవ్రత వల్ల ఈ అద్భుత దృశ్యాన్ని ఎక్కువసేపు చూడలేకపోయామని ప్రజలు తెలిపారు. దుమ్ము, ధూళి కాలుష్య మేఘాలు సూర్యుని చుట్టూ ఆవర్తనమై ఉన్నప్పుడు వాటిపై సూర్యకిరణాలు పడితే ఇటువంటి దృశ్యం ఏర్పడుతుందని ఆలిండియా ఫిజికల్ సైన్స్ అధ్యాపకుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగ చంద్రశేఖర్ తెలిపారు. ఇటువంటి దృశ్యాలు గతంలోనూ ఏర్పడ్డాయని చెప్పారు. వీటి ప్రభావం పర్యావరణంపై దుష్ర్పభావం చూపే అవకాశం లేదని, ఆందోళన పడాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారని పేర్కొన్నారు.
- విజయనగరం అర్బన్/గంట్యాడ/పార్వతీపురం