► ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్
► నరసరావుపేటలో ప్రభాకరరెడ్డి దిష్టిబొమ్మ దహనం
నరసరావుపేట : వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌మోహన్ రెడ్డిని తులనాడిన జేసీ ప్రభాకరరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ ప్రభాకరరెడ్డి క్షమాపణకు అసెంబ్లీలో డిమాండ్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. జగన్‌మోహన్ రెడ్డితో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిపై ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్టీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు నరసరావుపేటలో ఆందోళన చేశారు. తొలుత పార్టీ కార్యాలయం నుంచి ప్రభాకరరెడ్డి దిష్టిబొమ్మతో ఊరేగింపుగా మల్లమ్మ సెంటర్‌కు చేరుకున్నారు. జేసీ క్షమాపణ చెప్పాలని, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మల్లమ్మ సెంటర్‌లో ప్రభాకరరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే అని మర్చిపోయి, మద్యం సేవించి, రోడ్డుపై కూర్చుని సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ప్రభాకరరెడ్డికి సంస్కారంలేదనేది స్పష్టమయిందన్నారు. హత్యలు చేసి, అరాచకానికి పాల్పడి, డబ్బులు సంపాదించి లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్న ప్రభాకరరెడ్డి ప్రతిపక్షనేత జగన్‌కు క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి పెట్టిన భిక్షతోనే జేసీ దివాకరరెడ్డి, ప్రభాకరరెడ్డి గెలుపొందారన్నారు. స్థాయిని మరిచి ప్రభాకరరెడ్డి ఈవిధంగా దూషించడాన్ని యావత్తు రాష్ట్ర ప్రజలు ఖండిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఎస్.సుజాతాపాల్, మద్దిరెడ్డి నరసింహారెడ్డి, పిల్లి ఓబుల్‌రెడ్డి, వేముల శివ, షేక్.ఖాదర్‌బాషా, మల్లెల అశోక్, షేక్.సైదావలి, షేక్.మహబూబ్‌బాషా, విద్యార్థి విభాగ నాయకుడు ఆకాష్, బుజ్జి, కౌన్సిలర్లు మాగులూరి రమణారెడ్డి, షేక్.రెహమాన్, కారుమంచి మీరావలి తదితరులు పాల్గొన్నారు.
కొమెరపూడిలో ..
సత్తెనపల్లి : మండలంలోని కొమెరపూడి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం సెంటర్‌లో ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.