ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యూరని, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ...
అందరికీ పింఛన్లు ఇవ్వాలంటూ నినాదాలు
తిరుపతి కార్పొరేషన్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యూరని, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ఆరోపిస్తూ సీపీఎం నాయకులు ఎమ్మెల్యే వెంకటరమణను అడ్డుకున్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో శుక్రవారం సప్తగిరినగర్, యశోదనగర్ ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా యశోదనగర్‌లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన జన్మభూమి సభకు ఆయన చేరుకున్నారు. ఈసందర్భంగా అక్కడికి చేరుకున్న సిపిఎం పార్టీ నాయకులు, స్థానికులు ఎమ్మెల్యేను సమస్యలపై నిలదీశారు. సుందరయ్యనగర్, రైల్వేకాలనీ, యశోదనగర్‌లోని తాగునీరు, అండర్ డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. దీనికి ఎమ్మెల్యే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోగా హడావిడిగా ఐదుగురికి పింఛన్లు ఇచ్చేసి, అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. దీంతో సీపీఎం నాయకులు పాఠశాల ప్రధాన గేట్లకు అడ్డంగా నిలుచుకుని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. అక్కడి నుంచి కదలకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలని, అర్హులందరికి పింఛన్లు, ఇంటి పట్టాలు కేటాయించాలని నినాదాలు చేశారు.
గేటు ముందు బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి సుబ్రమణ్యం మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు ఇస్తామని లబ్ధిదారులందరిని ఆహ్వానించి, కేవలం ఐదుగురికే ఇచ్చి తప్పుకోవడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. సుందరయ్య నగర్, రైల్వే కాలనీ, యశోదనగర్‌లో రోడ్డు, తాగునీరు, యూడీఎస్, పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని పలు మార్లు చెప్పినా స్పందించక పోవడం దారుణం అన్నారు. ఎమ్మెల్యే, అధికారులు స్పందించి సీపీఎం నాయకులతో మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. సీపీఎం నాయకులు జయచంద్ర, యాదగిరి, గురుప్రసాద్, చిన్న పాల్గొన్నారు.