తమ పార్టీ తరఫున గెలిచి, తెలుగుదేశంలో చేరిన విజయవాడ సిటీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్
కాకినాడ : తమ పార్టీ తరఫున గెలిచి, తెలుగుదేశంలో చేరిన విజయవాడ సిటీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్ డిమాండ్ చేశారు. స్థానిక భాస్కర బిల్డింగ్‌లో మంగళవారం రాత్రి జరిగిన మైనార్టీ సెల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలను అడ్డు పెట్టుకుని గెలిచిన జలీల్‌ఖాన్ పార్టీ ఫిరాయించడం తగదన్నారు.
చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. లేకుంటే ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు అక్బర్ అజామ్ మాట్లాడుతూ ముస్లిం ఓట్లతో గెలిచిన జలీల్‌ఖాన్ మైనార్టీలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్నికల్లో మైనార్టీలకు ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వని పార్టీలో చేరారని విమర్శించారు. స్వార్థం కోసమే ఆయన పార్టీ మారారన్నారు. ఈ సమావేశంలో ముస్లిం ప్రతినిధులు ఎండీ వలీబాషా, ఎండీ లాల్, బాబ్జీ, ఖాజా, రోషన్, అమానుల్లా, ఖలీద్, అబ్దుల్ రహీమ్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.