* అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో బుధవారం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్) అమల్లోకి వచ్చింది. అలాగే రాజకీయ పార్టీలు ఏం చేయవచ్చు.. ఏమి చేయరాదు.. ఎన్నికల ప్రచారం సరళి ఏ విధంగా ఉండాలి అనే వివరాలను రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై వారికి వివరించారు. నియమావళిని ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలను స్పష్టం చే శారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నియామవళి అమల్లో ఉన్నందున ఏం చేయవచ్చు.. ఏమి చేయరాదనే వివరాలు తెలిపారు. ఆ వివరాలివీ..
* రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలో ఆచరణ సాధ్యమైన వాగ్దానాలను, హామీలనే పేర్కొనాలి. అలాగే ఇచ్చే హామీలకు అయ్యే వ్యయాన్ని కూడా ఉజ్జాయింపుగా స్పష్టం చేయాలి.
* అభ్యర్థులు ఇక నుంచి ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రత్యేకంగా బ్యాంకులో అకౌంట్‌ను తెరవాలి. ఆ అకౌంట్ నుంచే ఎన్నికల వ్యయం చేయాలి. ఎన్నికలకు సంబంధించి ఏ వ్యయమైనా ఆ అకౌంటు నుంచే చెక్ ఇవ్వాలి.
* అభ్యర్థులు ఆస్తులకు సంబంధించి అఫిడవిట్‌లో పేర్కొన్న అన్ని కాలమ్‌లను పూర్తి చేయాలి. ఏ కాలమ్‌ను కూడా ఖాళీగా వదలరాదు. ఏమీ లేకపోతే ఆ విషయాన్ని ఆ కాలంలో రాయాలి. ఖాళీగా వదిలితే నామినేషన్‌ను తిరస్కరిస్తారు. అభ్యర్థులు దేశంలోనే కాకుండా విదేశాల్లోని బ్యాంకుల్లో, సంస్థల్లో డిపాజిట్లు, పెట్టుబడులు, అప్పుల వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలి. అభ్యర్థుల పేరు మీదే కాకుండా భార్య పేరు మీద, తనపై ఆధారపడిన వ్యక్తుల ఆస్తుల వివరాలను వెల్లడించాలి. అభ్యర్థులు తనపై గల అన్ని రకాల కేసులను అఫిడవిట్‌లో పేర్కొనాలి.
* లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు రూ. 70 లక్షల వరకు ఎన్నికల వ్యయం చేయవచ్చు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు రూ. 28 లక్షల వరకు వ్యయం చేయవచ్చు. అంతకు మించి వ్యయం చేస్తే అనర్హులవుతారు.
* పార్టీల ఎన్నికల వ్యయంపై ఆంక్షలు లేవు. కానీ ప్రతి పార్టీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత 75 రోజుల్లోగా పార్టీ ఎన్నికల వ్యయం లెక్కలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలి.
* ఏ ప్రభుత్వ శాఖల్లోగాని అడ్‌హాక్ పోస్టింగ్‌లు వంటి నిర్ణయాలు తీసుకోరాదు. కొత్త కార్యక్రమాలు పథకాలకు ఉత్తర్వులను జారీ చేయరాదు. కొనసాగుతున్న కార్యక్రమాలను మాత్రం యథాతథంగా కొనసాగించవచ్చు.
* పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల సర్వేలను రాష్ట్రంలో తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ జారీ ముందు రోజు వరకు ప్రసారం చేసుకోవచ్చు. తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ జారీ అయ్యాక సర్వేలు ప్రచురించడం, ప్రసారం చేయడం చివరి దశ పోలింగ్ ముగిసే వరకు నిషేధం.
* టీవీల్లో పార్టీలు ఇచ్చే ప్రకటనలను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. ఏ పార్టీ అయినా టీవీల్లో ఇచ్చే ప్రకటనలను ముందుగా కమిటీకి చూపించి అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా ప్రకటనలు ఇస్తే ఆ పార్టీలు, ప్రసారం చేసిన మీడియాపైన చర్యలుంటాయి.
* అభ్యర్థులు గాని, రాజకీయ పార్టీల నేతలుగాని ప్రచార కాన్వాయ్‌లో మూడు వాహనాలను మించి అనుమతించరు. అంతకన్నా ఎక్కువ వాహనాలను వినియోగిస్తే ఆభ్యర్థి లేదా పార్టీ ఎన్నికల వ్యయంలో లెక్క రాస్తారు.
* ప్రచార సభలు నిర్వహణలకు, మైకుల ఏర్పాటుకు ముందుగా స్థానిక పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా సభలు, ప్రచారం నిర్వహించరాదు. వ్యక్తుల ఇంటి ముందు ధర్నాలు, పికెటింగ్‌లు చేయరాదు. ఒక పార్టీ పోస్టర్‌ను మరో పార్టీ తొలగించరాదు. రాత్రి పది గంటల తరువాత మైక్‌లతో ప్రచారం నిర్వహించరాదు.
* ఎన్నికల ప్రచారంలో పార్టీల నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత జీవితాలపై విమర్శలు, ఆరోపణలు చేయరాదు. కుల, మత, ప్రాంత భావాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదు. పరస్పరం అగౌరవం, విభేదాలు పెంచే విధంగా కులాలు, జాతుల మధ్య విద్వేషాలు సృష్టించే భాషాపరమైన ప్రసంగాలు చేయరాదు.
* మసీదులు, దేవాలయాలు, చర్చిలను ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదు. అలాగే ప్రభుత్వ ఆస్తులు, భవనాలను కూడా ప్రచారానికి వినియోగించరాదు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో ఎటువంటి ప్రచారానికి సంబంధించిన రాతలు, పోస్టర్లు, బోర్డులు ఉండరాదు.
* ప్రభుత్వ, పబ్లిక్ ఆస్తులు, భవనాలు, గోడలపై ఎన్నికలకు సంబంధించిన రాతలు ఏమీ రాయరాదు. అలాగే ప్రచారానికి సంబంధించిన బోర్డులను అమర్చరాదు. ప్రైవేట్ ఆస్తులపై వారి అనుమతి తీసుకునే ప్రచారానికి వినియోగించుకోవాలి.