1 నుంచి నగదు బదిలీ పథకం
Published Thu, Aug 29 2013 3:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్:జిల్లాలోని గ్యాస్ వినియోగదారులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమలులోకి వస్తున్నట్లు కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. వంద శాతం వినియోగదారులు నగదు బదిలీ పథకంలో చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం సాయంత్రం బ్యాంకర్లు, ఎల్‌పీజీ గ్యాస్ డీలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దశలవారీగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో మొదటి దశలో ఏడు జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమలు చేశారని, రెండవ దశలో ప్రకాశం జిల్లాను ఎంపిక చేసినట్లు వివరించారు.
గ్యాస్ వినియోగదారులంతా నగదు బదిలీ పథకంలో చేరే విధంగా బ్యాంకర్లు, ఎల్‌పీజీ డీలర్లు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 5 లక్షల 63 వేల మంది గ్యాస్ వినియోగదారులున్నారన్నారు. వీరందరినీ నూరుశాతం నగదు బదిలీ పథకంలో అనుసంధానం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 33 లక్షల 92 వేల మందిని ఆధార్ కార్డులో నమోదు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 32 లక్షల 78 వేల మంది వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి మండల కేంద్రాల్లో ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. మూడునెలల్లోపు నగదు బదిలీ పథకం ప్రక్రియ పూర్తి కావాలన్నారు.
వినియోగదారులకు ఏటా సబ్సిడీపై తొమ్మిది సిలిండర్లు అందిస్తుందని, ఆ తరువాత తీసుకునే వాటికి రూ. 950 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి గ్యాస్ వినియోగదారుడు నగదు బదిలీలో వచ్చేలా చూడాలని ఆదేశించారు. నగదు బదిలీ పథకం గురించి విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు. గ్రామాల్లో దండోరా ద్వారా ప్రచారంచేసి ప్రజలు వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్, నెల్లూరు సిండికేట్ బ్యాంకు డీజీఎం కే శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా ఎల్‌డీఎం ప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రంగాకుమారి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement