
నోటుకు నోటు
కదిరి : ‘ఓటుకు నోటు’ అన్నది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న చర్చ. కదిరి ప్రాంతంలో మాత్రం ‘నోటుకు నోటు’ అన్నది ప్రస్తుత హాట్ టాపిక్. ఇప్పటికే ఎంతో మంది అమాయకులు ‘నోటుకు నోటు’ ముఠా సభ్యుల బారిన పడి రూ. లక్షల్లో మోసపోయారు. ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే వ్యాపార సూత్రం లాగే ఈ ముఠా తమ నోటుకు నోటు స్కీంను ప్రచారంలో పెట్టింది. ఆశ పడ్డ వారికి చుక్కలు చూపించి నోట్లు పంచుకుంటున్నారు. కదిరి ప్రాంతంలోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలోనూ ఈ ముఠా దందా సాగించినట్లు సమాచారం. ఈ ముఠా సభ్యులకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడితో పాటు ఓ పోలీస్ అధికారి మద్దతు కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మోసగిస్తున్నది ఇలా..
కదిరి పట్టణానికి చెందిన 15 మంది సభ్యులు ఓ ముఠాగా ఏర్పడి నోటుకు నోటు పేరుతో ఆశపడ్డ వారిని దోచుకుంటున్నారు. రూ 50 వేలు తీసుకెళ్లి ఆ ముఠా సభ్యులను కలిస్తే.. అదే రోజు ఆ డబ్బు తీసుకెళ్లిన రూ.లక్ష ఇస్తామని ఆశ చూపుతున్నారు. ఒక వ్యక్తి ఆ ముఠా సభ్యులను రహస్య ప్రదేశంలో కలిసి తాను తెచ్చిన డబ్బును వారి ముందు పెడితే దానికి పూజలు చేసి, మంత్రాలు చదివి నాలుగైదు గంటలు గడిచిన తర్వాత అక్కడ ముందే ఏర్పాటు చేసిన మరో నోట్ల కట్టను అతనికి అదనంగా ఇవ్వబోతారు.
అదే సమయంలో అదే ముఠా సభ్యులు కొందరు సైరన్ మోగించుకుంటూ పోలీస్ వేషంలో అక్కడికి చేరుకుంటారు. డబ్బు తెచ్చిన వ్యక్తితో పాటు అక్కడ పూజలు చేస్తున్న ముఠా సభ్యులకు సైతం లాఠీలతో కొడతారు. పోలీస్ స్టైల్‌లోనే ‘జీప్ ఎక్కండ్రా స్టేషన్‌కు పోదాం’ అంటారు. ‘సార్, ఈసారికి వదిలేయండి. ఇంకెప్పుడూ ఇలా చేయమని ప్రాధేయపడి ఆడబ్బు ముట్టజెబుతారు. డబ్బు తీసుకెళ్లిన వ్యక్తి సైతం పరువుదక్కిందని అక్కడి నుంచి బయటపడతారు.
మరి కొద్ది సేపటికే దొంగ, పోలీస్ ఒక్కటైనట్లు ఆ ముఠా సభ్యులు కలిసి ఆ డబ్బును పంచుకుంటారు. వీరి బారిన పడిన వారు పరిస్థితి మాత్రం దయనీయం. ‘పోలీసులే రాకపోయి ఉంటేనా.. నా పంట పండేది’ అని ఆనందపడేవారు కొందరైతే, మోసపోయామని గ్రహించి బయటకు చెబితే పోలీసులు తమనెక్కడ అరెస్ట్ చేస్తారో నని లోలోపలే నలిగి పోతున్న వారు ఇంకొందరు. ఇలాంటి వారి ఆశలను భయాల మాటున నోటుకు నోటు వ్యాపారం అడ్డూ అదుపులేకుండా సాగిపోతోంది. ఈ విషయం డీఎస్పీ రామాంజనేయులు దృష్టికి తీసుకెళ్తే వెంటనే నిఘా పెట్టి అలాంటి ఉంటే ముఠా గుట్టు రట్టు చేస్తామన్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.