
కొత్త రాష్ట్రాల్లోనే మునిసిపల్ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఇక కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాక జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈనెలలో మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని భావించినా.. రాష్ర్ట విభజన నిర్ణయంతో ఆ ప్రక్రియ వెనక్కి పోయింది. ఉన్నతస్థాయి నుంచి అందిన సంకేతాల నడుమ రిజర్వేషన్ల అంశాన్ని పురపాలక శాఖ పక్కనపెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనల నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా సాగే అవకాశం లేదని, ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వ పెద్దలు ఎన్నికలపట్ల సముఖంగా లేరని సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఎన్నికలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని అవసరమైతే రాష్ట్ర హైకోర్టుకు నివేదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మునిసిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు సెప్టెంబర్ రెండో తేదీలోగా నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో 2011 జనాభా లెక్కలు వచ్చాక నాలుగు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలన్న తీర్పు మేరకు ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. అయితే అనుకోకుండా కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి (సీడబ్ల్యూసీ), యూపీఏ భాగస్వామ్య పక్షాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. ఢిల్లీ నుంచి నిర్ణయం వెలువడిన తరువాత సీమాంధ్ర లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ ఆందోళనలలో ఉద్యోగులు అధికంగా పాల్గొనడమేకాక, ఈ నెల 12వ తేదీ తరువాత నిరవధిక సమ్మెలోకి వెళ్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యంకాదని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తిదశకు వచ్చిన తరుణంలో రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితుల వల్ల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు పూర్తయినా, చైర్‌పర్సన్, మేయర్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఈ రిజర్వేషన్లపై దృష్టిపెట్టడం లేదని ఓ అధికారి వివరించారు. ఆగస్టులో రచ్చబండ నిర్వహించాక ఎన్నికలకు వెళ్లాలని భావించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకుంది. అలాగే మునిసిపల్ ఎన్నికల తరువాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని భావించినా... అప్పటిలోగా రాష్ట్ర విభజన ప్రక్రియ చాలా ముందుకు వె ళ్లిపోయే అవకాశాలు ఉండడంతో అవి కూడా వాయిదాపడక తప్పదని పంచాయతీరాజ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. విభజన నేపథ్యంలో పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాకే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
కేంద్ర నిధుల కోసం లేఖ..
గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినందున 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.2,950 కోట్ల నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తికాకుండా కేంద్రం నిధులు విడుదల చేయడానికి అంగీకరిస్తుందా లేదా అన్నది అనుమానంగా మారింది. నిధులులేక ఇప్పటికే అభివృద్ధి కుంటుపడిన పంచాయతీలకు కేంద్ర నిధులు వస్తేనే కార్యక్రమాలు ముందుకు సాగే అవకాశం ఉంది.