పోలీసుల అదుపులో నిందితుడు, అతడి నుంచి స్వాధీనం చేసుకున్న కత్తులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు నుంచి మరో చిన్న కత్తిని స్వాధీనం చేసుకున్నట్టు విశాఖపట్నం పోలీసు కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా చెప్పారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 11 పేజీల లేఖపై నిందితుడిని ప్రశ్నించినట్టు చెప్పారు. లేఖలో కొన్ని పేజీలు తన స్నేహితుడు టి. రేవతిపతి(19)తో, కొన్ని పేజీలు తన బంధువు విజయలక్ష్మితో రాయించినట్టు నిందితుడు చెప్పాడని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోలి ప్రాంతానికి చెందిన రేవతిపతి నాలుగు నెలలుగా ఎయిర్‌పోర్టులోని ప్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడని వెల్లడించారు. (ఆ లేఖపై సందేహాలెన్నో!)
శ్రీనివాసరావు ఏడాది కాలంలో ఒకే సిమ్ కార్డుతో 9 మొబైల్ ఫోన్లు వాడినట్టు గుర్తించామన్నారు. కోడి పందేలకు వాడే కత్తితో దాడికి పాల్పడినట్టు, దీన్ని అతడు జనవరిలో ఊరికి వెళ్లినప్పుడు కొనుగోలు చేసినట్టు గుర్తించామన్నారు. ఈ కత్తి 8 సెంటీమీటర్లు పొడవు ఉందని, దాని పదును 3 సెంటీమీటర్లుపైగా ఉందని తెలిపారు. ప్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌ప్రసాద్‌ను విచారణకు పిలుస్తామని కమిషనర్ చెప్పారు. నిందితుడు చెప్పిన విషయాలను నిర్ధారించేందుకు తమ బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయన్నారు. శ్రీనివాసరావును తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరతామన్నారు. నిందితుడిని విచారించిన తర్వాత కింగ్ జార్జి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం కోర్టులో హాజరుపరిచారు.
విలేకరులతో మాట్లాడుతున్న పోలీసు కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా
Comments
Please login to add a commentAdd a comment