మారని వైస్‌ చాన్సలర్‌ తీరు! | N G Ranga Agricultural University Vice Chancellor Has Allegations Of Corruption | Sakshi
Sakshi News home page

మారని వైస్‌ చాన్సలర్‌ తీరు!

Published Fri, Jul 19 2019 10:34 AM | Last Updated on Fri, Jul 19 2019 10:34 AM

N G Ranga Agricultural University Vice Chancellor Has Allegations Of Corruption - Sakshi

బుధవారం యూనివర్సిటీ ఎదుట ఆందోళన చేస్తున్న ఉద్యోగులు

సాక్షి, అమరావతి: ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ దామోదరనాయుడు అవినీతి, అక్రమాలపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఆయన తీరు సరిగా లేదని, మమ్ములను ఇబ్బంది పెడుతున్నారని యూనివర్సిటీ ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణ అధికారిగా మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్నను ప్రభుత్వం నియమించింది. ఈయన వర్సిటీ రికార్డులను పరిశీలించి సిబ్బందిని విచారణ చేస్తున్నారు. అయితే వైస్‌ చాన్సలర్‌ దామోదర్‌నాయుడు మాత్రం రికార్డులు తారు మారు చేసి, విచారణ అధికారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో వర్సిటీలోని సిబ్బంది వీసీని దీర్ఘకాలిక సెలవుపై పంపి సీఐడీతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరుతున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ను ప్రస్తుత వీసీనే నియమించడంతో, వీసీ అక్రమాలకు ఆయన దన్నుగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ను సైతం సస్పెన్షన్‌ చేసి, రికార్డులు తారు మారు చేయకుండా పారదర్శకంగా విచారణ జరిగేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వీసీ మాత్రం తనకు బీజేపీ అగ్రనేతల అండదండలు ఉన్నాయని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ విచారణకు హాజరైన ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విచారణాధికారికి సైతం ఇప్పటికే ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఐఆర్‌ 27 శాతం సైతం ఉద్యోగులకు అమలు చేయకుండా వీసీ ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఉద్యోగులు యూనివర్సిటీ ఎదుట గత బుధవారం ఆందోళనకు దిగారు.  

ఉద్యోగోన్నతుల నిరాకరణ 
2018లో చేసిన సీఏఎస్‌ఏ (కాసా) ఉద్యోగోన్నతుల్లో వింత నిబంధనలతో 57 మంది అర్హత ఉన్న ఉద్యోగులకు ఉద్యోగోన్నతులను వీసీ నిరాకరించారు. అక్రమ బదిలీల వేధింపులపై కోర్టు తీర్పును అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడటమే కాకుండా ప్రతివాదులుగా ఉన్న ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేసి వేధింపులకు గురిచేశారు. ఆడిట్‌ అభ్యంతరాలు, చిన్న చిన్న కారణాలతో ఉద్యోగుల హక్కు అయిన మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ను ఏడాది కాలంగా నిలుపుదల చేశారు. సుమారు 200 మందికి పైగా విచారణ అధికారి, మార్కెటింగ్‌ కమిషనర్‌ ఎదుట ప్రత్యక్షంగా రెండు దఫాలుగా హాజరై తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. 500 మందికిపైగా సిబ్బంది, విద్యార్థులు ఈమెల్స్‌ ద్వారా వీసీపై ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరుగుతున్నప్పటికీ దామోదర్‌నాయుడు వివిధ వ్యక్తుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధిత సిబ్బంది, విద్యార్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. గత శనివారం 13వ తేదీ సుమారు వంద మందికిపైగా బాధిత సిబ్బంది వీసీ బెదిరింపు దోరణిపై విచారణ అధికారికి రాత పూర్వక ఫిర్యాదు చేశారు. ఉపకులపతిని ప్రభుత్వం దీర్ఘకాలిక సెలవుపై పంపి పూర్తి స్థాయి విచారణ సీఐడీతో పారదర్శకంగా జరిపించాలని ఉద్యోగులు, విద్యార్థులు కోరుతున్నారు. 

అవినీతి ఆరోపణలు ఇవే..

  •  ఉద్యోగుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ నిలుపుదల చేసి ఇబ్బందుల పాలు చేశారు. 
  •  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జాక్ట్‌ (టైపిస్టు) నియామక రాత పరీక్షల లీకేజీలో కీలక పాత్ర పోషించారు. ––ఎన్నికల కోడ్‌ను అతిక్రమించి డి.ఎస్‌.కోటేశ్వరరావును నోడల్‌ అధికారిగా నియమించారు. 
  •  వర్సిటీ వాహనాలను కుటుంబ సభ్యులు అడ్డగోలుగా వాడుకున్నారు. 
  •  వర్సిటీ రిజిస్ట్రార్‌ కంట్రోలర్‌ రవాణా అధికారి అండదండలతో అక్రమాలు, ఆగడాలకు పాల్పడ్డారు.
  •  సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. 
  •  వర్సిటీ నిధులు ప్రైవేటు బ్యాంకుకు బదిలీ చేసి కుమారుడికి క్విడ్‌ ప్రోకో ద్వారా ఉద్యోగంతో పాటు, ప్రమోషన్‌ పొందారు. 
  •  అక్రమ బదిలీలు, వేధింపులు, ఉద్యోగోన్నతుల్లో కీలక పాత్ర పోషించారు. 
  •  వైఎస్సార్‌ సీపీ అనుకూల ముద్ర వేసి తాత్కాలిక ఉద్యోగులను తొలగించారు. 
  •  కాంట్రాక్టు, టైమ్‌ స్కేల్‌ లేబర్‌ న్యాయమైన కోరికలను సైతం నిరాకరించారు. 
  •  మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. 
  •  వీటన్నింటికి సంబంధించి ఆధారాలను విచారణాధికారికి వర్సిటీ ఉద్యోగులు అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement