ప్రతిష్టాత్మక ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పోస్టుకు రోజురోజుకూ పోటీ పెరుగుతోంది.
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పోస్టుకు రోజురోజుకూ పోటీ పెరుగుతోంది. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి గుంటూరుకు సమీపంలోని లాంఫారానికి తరలిపోయిన విశ్వవిద్యాలయానికి పాలక మండలి వ్యవహారం కొలిక్కి రావడంతో ఇక పూర్తి కాలపు వైస్ ఛాన్సలర్ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇతర యూనివర్శిటీల మాదిరి వ్యవసాయ వర్శిటీకి వైస్ ఛాన్సలర్ నియామకానికి సెర్చ్ కమిటీ (శోధక సంఘం) ఉండదు. రాష్ట్ర ప్రభుత్వమే వ్యవసాయ రంగ ప్రముఖులతో చర్చించి తనకు ఇష్టమైన వారిని నియమించుకునే స్వేచ్ఛ ఉంది.
ఈ పదవికి పోటీ పడుతున్న వారిలో ప్రస్తుత ఇన్‌చార్జీ వీసీ విజయకుమార్‌తో పాటు నూనె గింజల పరిశోధన సంస్థ డైరెక్టర్ వరప్రసాద్, మరట్వాడ యూనివర్శిటీ వీసీగా ఉన్న తెలుగు వ్యక్తి డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, యూనివర్శిటీ రిజిస్ట్రార్ టీవీ సత్యనారాయణ, యూనివర్శిటీ ప్రస్తుత అధికారులు ఆర్. వీరరాఘవయ్య, రమేష్‌బాబు, డాక్టర్ సుధాకర్, ఆలపాటి సత్యనారాయణ తదితరులున్నారు. అధికార పార్టీలోని తమ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్యలతో ఎవరికి వారు పైరవీలు చేయించుకుంటున్నారు.