ఇంత వణుకెందుకో? | Naidu Mulls Withdrawal Of Security To IT Sleuths! | Sakshi
Sakshi News home page

ఇంత వణుకెందుకో?

Published Sat, Oct 6 2018 4:07 AM | Last Updated on Sat, Oct 6 2018 4:56 AM

Naidu Mulls Withdrawal Of Security To IT Sleuths! - Sakshi

శుక్రవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సాక్షి, అమరావతి: భారీగా ఆర్జించి పన్ను ఎగవేసిన సంస్థలలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సోదాలు జరపడం సర్వసాధారణమే అయినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గజగజా వణికిపోవడం.. ఏదో మిన్ను విరిగి మీదపడిపోయినట్లు హడావుడిగా కేబినెట్‌ సమావేశం జరపడం చూసి అటు ప్రజలు, ఇటు అధికారులు విస్తుపోతున్నారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాలలోని పలు కంపెనీలలో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అందులో అన్ని పార్టీల నాయకులకు చెందిన సంస్థలు ఉన్నాయి. అలాగే ముఖ్యమంత్రి సన్నిహితులకు సంబంధించినవి కూడా ఉన్నాయి.

అయితే ముఖ్యమంత్రి ఎందుకు వణికిపోతున్నారు? మంత్రివర్గ సమావేశాన్ని పార్టీ నేతల సమావేశంగా మార్చి ఈ సోదాలపై ఎందుకు చర్చిస్తున్నారు.? వీటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పాలని మంత్రులను సలహా అడగడం, న్యాయ శాఖ కార్యదర్శిని పిలిపించుకుని ఏం చేయాలో చెప్పాలని కోరడం, న్యాయ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, టీడీపీ ఎంపీలు, ముఖ్య నాయకులను శనివారం సమావేశానికి రావాలని పిలవడం.. ఇవన్నీ చూస్తే చంద్రబాబును ఐటీ సోదాలు బెంబేలెత్తిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఎందుకిలా ఆయన భుజాలు తడుముకుంటున్నారు? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పలు కంపెనీలలో జరుగుతున్న సోదాలను రాష్ట్రంపై జరుగుతున్న దాడిగా చంద్రబాబు అభివర్ణించడంలో అర్థం ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. సాధారణంగా ఐటీ రిటన్స్‌ సమర్పించిన తరువాత సెప్టెంబరు, అక్టోబర్‌  నెలల్లో ఐటీ శాఖ అసెస్‌మెంట్‌ చేస్తుందని, అసెస్‌మెంట్‌లో తేడాలున్న  సంస్థలకు ఐటీ నోటీసులు జారీ చేయడం అనేది సర్వసాధారణమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నోటీసులకు స్పందించకపోతే ఐటీ సోదాలు చేయడం అనేది దేశంలో ఎక్కడైనా జరుగుతుందని, అందుకు రాష్ట్రం అతీతం ఏమీ కాదని ఆ అధికారి పేర్కొన్నారు.

అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నవేగా..
చంద్రబాబు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు అనే చర్చ అన్ని వర్గాల్లోనూ జరుగుతోంది. ఐటీ అధికారుల బృందాలకు కల్పించిన పోలీసు భద్రతను ఉపసంహరించుకుంటామని ప్రకటించడం, కేంద్ర సంస్థలపై ఎదురు కేసులు పెట్టాలని చంద్రబాబు నిర్ణయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇటీవల కర్నాటక, తమిళనాడులో ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో పలు సంస్థలలో సోదాలు చేసిన ఐటీ అధికారులు శుక్రవారం రాష్ట్రంలోనూ అవే తరహా సోదాలు జరిపారు. ఇద్దరు టీడీపీ నాయకులకు చెందిన కంపెనీలతోపాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన పోతుల రామారావు, ఇతర కంపెనీలలో సోదాలు జరిగాయి.

వైఎస్సార్సీపీకి చెందిన నంబూరి శంకరరావు కంపెనీలోనూ సోదాలు జరిగాయి. గతంలోనూ రాష్ట్రంలో ఇదే తరహాలో పలు సంస్థలలోనూ, ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న సోదాలపై చంద్రబాబు, ఆయన పరివారం ఉలిక్కిపడడమేగాక ఏదో జరిగిపోతోందని, ఇది కేంద్రానికి, రాష్ట్రానికి జరుగుతున్న యుద్ధమని, మోడీ ఏపీపై దాడి చేయిస్తున్నారని, ఏపీ ప్రజలకు, మోడీకి యుద్ధం జరుగుతోందని అనుకూల మీడియాలో రెండురోజుల నుంచి ఊదరగొట్టిస్తున్నారు. మంత్రి నారాయణ కాలేజీలు, ఆస్తులపై దాడులు చేస్తున్నారని, మీడియాను చూసి ఐటీ అధికారులు వెనక్కి వెళ్లిపోయారనే ప్రచారాన్ని లేవనెత్తారు.

బాబు ఎడతెగని చర్చలు
చంద్రబాబు శుక్రవారం ఉదయం నుంచి జరుగుతున్న సోదాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఎడతెగని చర్చలు జరిపారు. మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం జరగాల్సి వున్నా దానికి గంట ముందే అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమై కేంద్రం, రాష్ట్రంపై యుద్ధం ప్రకటించిందని, దీన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పాలని కోరారు.

మంత్రివర్గ సమావేశంలోనూ అజెండాను పక్కనపెట్టి ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. తాను తన ప్రభుత్వం నిజాయితీకి మారుపేరని చెప్పుకునే చంద్రబాబు ఐటీ సోదాలు జరుగుతుంటే ఇంతగా బెంబేలెత్తిపోవడం చూసి విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. తప్పు చేయకపోతే ఇంతలా భయపడాల్సిన అవసరం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే వాటికి  సమాధానం చెప్పలేక టీడీపీ మంత్రులు, నాయకులు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు.
 
ఐటీ అధికారులకు భద్రత ఉపసంహరిద్దాం
మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో సోదాలు చేయడానికి వచ్చిన ఐటీ అధికారుల బృందాలకు ఇచ్చిన భద్రతను ఉపసంహరించుకోవాలని చంద్రబాబు చెప్పారు. దీనిపై న్యాయశాఖ కార్యదర్శిని పిలిపించి భద్రత ఉపసంహరించుకోవచ్చా అని అడగ్గా ఐటీ అధికారులకు భద్రత కచ్చితంగా కల్పించాలనే నిబంధన ఏదీ లేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. అయితే అలాగే చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. మన పోలీసులను భద్రత కోసం ఉపయోగించుకుంటూ మన వారికి చెందిన సంస్థలలో సోదాలు చేయడం ఏమిటని పలువురు మంత్రులు అన్నట్లు తెలిసింది. కేంద్రం పరిధిలోని ఐటీ శాఖ రాష్ట్రంలో సోదాలు చేస్తున్నట్టే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అధికారులపై ఏసీబీ ఇతర దర్యాప్తు సంస్థలు దాడులు చేసే అవకాశం ఉందా అని చంద్రబాబు అధికారులను ఆరా తీశారు.

గతంలో ఇలాంటి అధికారం రాష్ట్రానికి ఉండేదని కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్న ఒప్పందం వల్ల ప్రస్తుతం ఆ అవకాశం లేదని న్యాయ శాఖ అధికారులు సమాధానమిచ్చారు. కేంద్రంతో చేసుకున్న ఆ ఒప్పందాన్ని ఉపసంహరించుకునేలా వెంటనే చర్యలు చేపట్టాలని, సాంకేతికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఐటీ సోదాలపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించి దీనిపై ఎలా ముందుకెళ్లాలో చర్చించేందుకు శనివారం న్యాయ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే టీడీపీ ఎంపీలు, మంత్రులు, ముఖ్య నాయకులతోనూ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అడ్వకేట్‌ జనరల్‌ను పిలిపించాలని ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు, ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు మోడీ ఈ దాడులు చేయిస్తున్నారని ప్రచారం చేయాలని మంత్రులకు సూచించారు. ఇది ఏపీపై మోడీ చేస్తున్న దాడి అని, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రాకుండా, కాంట్రాక్టర్లు భయపడి పనులు చేయకుండా అడ్డుకునేందుకు ఐటీ దాడులతో ఇలా అలజడి సష్టిస్తున్నారని చెప్పాలని ఆదేశించారు.

కేంద్రంపై పోరాడుతున్న రాష్ట్రంపై దాడులు చేస్తున్నారని, న్యాయం కోసం పోరాడుతుంటే అన్యాయంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలని దిశానిర్దేశం చేశారు. ఐటీ దాడులు, కేసీఆర్‌ తనపై చేస్తున్న విమర్శల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై సంతృప్తి శాతం పెరిగిందని చంద్రబాబు సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. వీటివల్ల సానుభూతి పెరిగి 79 శాతం ఉన్న సంతృప్తి శాతం 83కి పెరిగిందని ఆర్టీజీ అధికారులు ఈ సమావేశంలో చంద్రబాబుకు తెలిపారు. బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి ధర్మాబాద్‌ కోర్టుకు హాజరయ్యే విషయంపైనా చర్చించారు.

అప్రమత్తంగా ఉండండి
ముగ్గురు మంత్రులకు సీఎం హెచ్చరిక
ఏ క్షణంలోనైనా ఐటీ అధికారులు దాడులు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ముగ్గురు మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులు నారాయణ, అచ్చెంనాయుడు, యనమల రామకష్ణుడులకు ప్రత్యేకంగా చంద్రబాబు ఈ హెచ్చరికలు చేశారు. ఐటీ అధికారులు జాబితాలో చాలామంది టీడీపీ నాయకులున్నారని కానీ ప్రధానంగా వీరిపై ఎక్కువ దృష్టి ఉందని ఆయన చెప్పినట్లు సమాచారం. వీరుకాకుండా మరో ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమంచి కష్ణమోహన్, గొట్టిపాటి రవికుమార్, దామచర్ల జనార్థన్‌ తదితరులపై దాడులు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.

శుక్రవారం ఐటీ సోదాలు జరిగిన సంస్థలకు చెందిన వారితో టీడీపీకి ఉన్న లింకులు ఏమిటో ఆరా తీసి పూర్తి వివరాలు తనకు చెప్పాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాల వారీగా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉన్న వారి నాయకులను గుర్తించి వారిని అప్రమత్తం చేయాలని, దాడులు జరిగితే తప్పించుకునేందుకు ఎలాంటి సమాధానాలు చెప్పాలో, ఆస్తులను ఎలా కాపాడుకోవాలో వారికి సూచనలు, సహకారం ఇవ్వాలని పలువురు అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాగా ఐటీ దాడులు జరుగుతాయని, అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సీఎం సూచించడం వెనుక ఉద్దేశమేమిటని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

‘అక్రమాస్తులు, పన్ను ఎగవేతలు లేనప్పుడు అప్రమత్తం అవ్వాల్సిన పని ఏముంటుంది? తప్పులు చేసి ఆర్జించిన వారే ఆస్తులను దాచుకోవాలి. ఇందుకోసం అప్రమత్తం కావాలి. చంద్రబాబు చేసిన సూచనను పరిశీలిస్తేనే తన మంత్రివర్గంలోని వారు, పార్టీలోని కీలక నేతలు భారీగా అక్రమంగా సంపాదించి ఆదాయ పన్ను ఎగవేసినట్లు అర్థమవుతోంది. అప్రమత్తంగా ఉండాలని చెప్పడమంటే ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఐటీ అధికారులకు దొరక్కుండా ఎక్కడైనా భద్రపరుచుకోవాలని చెప్పడమే. అంటే ముఖ్యమంత్రే అక్రమార్కులను దొరక్కుండా తప్పించుకోవాలని సూచించినట్లు స్పష్టమవుతోంది’ అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

ఐటీ సోదాలు కొత్తేమీ కాదు
రాష్ట్రంలో ఐటీ సోదాలు కొత్తేమీ కాదని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. మచ్చుకు...
2017 లో జీవీపీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కు చెందిన జి.లక్ష్మయ్య, కె.వెంకటరమణరావు కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి.
2017 గోల్డ్‌ విన్నర్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ బ్రాండ్‌ కంపెనీకి చెందిన సోదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 54 చోట్ల జరగ్గా కాకినాడలో కాళేశ్వరి రిఫైనరిలో కూడా సోదాలు జరిగాయి.
2016లో రాష్ట్ర వ్యాప్తంగా బంగారు వర్తకుల షాపులు, ఇళ్లల్లో సోదాలు
2016లో బాహుబలి సినీ నిర్మాత శోభు యార్లగడ్డ కార్యాలయాలలో ఐటీ సోదాలు..
♦  2016 తెలుగుదేశం ఎమ్మెల్యే సత్యప్రభ ఆస్తులకు సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement