బంగారుతల్లికి 52 వేల దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గంటా శ్రీనివాసరావు, బాలరాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బంగారుతల్లి పథకం కోసం మొత్తం 51,925 మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారికి బ్యాంకు ఖాతాతో పాటు ఆధార్ కూడా ఉండాలని, వచ్చే ఏడాది నుంచి ఆధార్ ఉన్నవారే పథకానికి అర్హులని సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. పింఛన్ల లబ్ధిదారులను గుర్తించామని, త్వరలో జరిగే రచ్చబండలో వారికి పింఛన్లు అందిస్తామని ఆమె వివరించారు.
మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఉల్లిపాయలు సహా కూరగాయల ధరల పెరుగుదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతితో సమీక్ష నిర్వహించారు. ధరల తగ్గింపునకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సీఎం ఈ సందర్భంగా సీఎస్ను ఆదేశించారు. అలాగే సీమాంధ్రలో సకల జనుల సమ్మె, వరదల పరిస్థితిపై కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు.