
‘కెపాసిటీ’ కావాల్సిందే..
‘కెపాసిటీ’ కావాల్సిందే..
మంచాల : అసలే కరువుతో అల్లాడుతున్న రైతన్నకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అటు తరచూ ప్రకృతి ప్రకోపం.. ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యం.. వెరసి వ్యవసాయానికి గడ్డు కాలం ఎదురవుతోంది. బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లున్నా అరకొర విద్యుత్ సరఫరాతో పంటచేలకు నీరందని పరస్థితి. కెపాసిటర్లు బిగిస్తేనే బోర్లు నడుస్తాయంటూ విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు.
దీంతో భూమినే నమ్ముకున్న అన్నదాత ‘బోరు’మంటున్నాడు. కెపాసిటర్ల కోసం దాదాపు రెండు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నాడు. మండలకేంద్రంతోపాటు మండలంలోని ఆరుట్ల, బోడకొండ సబ్‌స్టేషన్ల పరిధిలో 4వేల వరకు బోరు బావుల కనెక్షన్లు, మరో 9వేల దాకా గృహుపయోగ కనెక్షన్లు ఉన్నాయి. సాధారణంగా ప్రతి సబ్‌స్టేషన్ నుంచిట్రాన్స్‌ఫార్మర్‌కు 440 వోల్ట్స్ విద్యుత్ సరఫరా అవుతుంది. వాటి నుంచి బోరు మోటారుకు 360 వోల్ట్స్ విద్యుత్ సరఫరా కావాలి. కానీ మండల పరిధిలో చాలా వరకూ 180 నుంచి 200 వోల్ట్స్ మాత్రమే సరఫరా అవుతోంది. 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌కు 20 కనెక్షన్లు, 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌కు 12, 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌కు 4 నుంచి 5 కనెక్షన్లు మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ ఉండాల్సిన వాటి కన్నా అధికంగా కనె క్షన్లు ఉన్నాయి. దీంతో లో ఓల్టేజీ సమస్య ఉత్పన్నమవుతోంది. కరెంట్ ఉన్నా లో ఓల్టేజీ కారణంగా బోరు మోటార్లు పని చేయడం లేదు. అధిక భారంతో తరచూ ట్రాన్స్‌ఫార్మర్లు, బోరుమోటార్లు కాలిపోతున్నాయి.
లో ఓల్టేజీ సమస్య తీవ్రం...
తాజాగా అదివారం విద్యుత్ శాఖ సిబ్బంది జాపాలలో త్రీఫేజ్ కరెంట్ ఎలా సరఫరా అవుతోందని పరీక్షించారు. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి బోరు వరకు 200 నుంచి 213 వోల్ట్స్ మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందని తేలింది. లో ఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉందని నిర్ధారణకు వచ్చారు. బోరు మోటార్లు పని చే యాలంటే తక్షణమే కెపాసిటర్లు బిగించుకోవాలని చెబుతున్నారు.
గత్యంతరం లేక
బిగించుకుంటున్న రైతులు..
రూ. వేలల్లో అప్పు చేసి పంట సాగు చేసిన రైతులు విద్యుత్ సమస్యతో బోర్లు పనిచేయక పంటలు ఎండిపోయి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉన్న పంటలు కాస్తోకూస్తో చేతికి రావాలంటే కెపాసిటర్లు తప్పవని గత్యంతరం లేక వాటిని కోనుగోలు చేసి బిగించుకుంటున్నారు. 2కేవీఏఆర్ కెపాసిటర్‌కు కంపెనీని బట్టి రూ.1000 నుంచి రూ.1,200, 3కేవీఏఆర్ కెపాసిటర్ రూ.1,600కు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల వాటిని బిగించినా బోర్లు పని చేయకపోవడంతో రూ. రెండు మూడు వేలు ఖర్చుచేసి మరింత పెద్ద కెపాసిటర్లను బిగిస్తున్నారు. వీటికోసం రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సమస్యపై విద్యుత్ శాఖ ఏఈఈ శంకర్‌ను వివరణ కోరగా పంటకు సక్రమంగా నీరందించాలంటే ప్రతిరై తు తప్పనిసరిగా కెపాసిటర్‌ను బిగించుకోవాలని, దీంతోలో ఓల్టేజీ సమస్య తీరడమే కాకుం డా బోరు మోటార్లపై భారం పడదన్నారు.