మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి
సాక్షి, సీలేరు: రాష్ట్రానికి నిరంతరం విద్యుత్ ఉత్పత్తిని అందిస్తున్న ఘనత సీలేరు విద్యుత్ కాం ప్లెక్సు సొంతం. రాష్ట్రానికి వెలుగులు నింపడంలో మొదటి స్థానంలో నిలిచి ప్రతి ఏటా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి ఎన్నో అవార్డులు దక్కించుకుంటోంది. అలాగే గోదావరి పంట భూములకు ఏటా 50టీఎంసీల వరకు నీటిని సరఫరా చేసి అన్నదాతలను ఆదుకునే గొప్పగుణమున్న విద్యుత్ కేంద్రంగా ఖ్యాతిని పెంచుకుంటోంది. ఇంతటి పేరున్న విద్యుత్ కేంద్రంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. జెన్‌కో సంస్థ ఎప్పు డూ ఇక్కడ విద్యుత్ తయారీని అభినందిస్తోందే తప్ప.. ఇక్కడ అధికారుల పనితీరు ఏమిటి? ఇక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి? పనుల నాణ్యత? నిధుల సక్రమ వినియోగం వంటి అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టిన దాఖ లాలు లేవనే విషయం కొన్ని అంశాల్ని పర్యవేక్షిస్తే స్పష్టమవుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం.. ప్రభుత్వానికి శాపంగా మారింది. కోట్లరూపాయల నష్టానికి కారణమవుతోంది. కమీషన్ల కక్కుర్తిలో పడి స్థానిక జెన్‌కో అధికారులు పనుల్లో నాణ్యతను గాలికొదిలేస్తున్నారు.
ఈ నిర్లక్ష్యమే భారీ ప్రమాదాలకు కారణమవుతోంది. పది రోజుల క్రితం డొంకరాయి పవర్ కెనాల్‌కు భారీగా గండి పడిన సంగతి తెలిసిందే. అయితే తుఫాన్ ప్రభావంతో సంఘటన జరిగినప్పటికీ.. గతంలో ఉన్న లోపాల్ని అధికారులు పట్టించుకోకపోవడం కూడా జెన్‌కో సంస్థకు శాపంగా మారింది. పవర్ కెనాల్‌కు గండి పడడంతో డొంకరాయి, మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో 485 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పది రోజులుగా నిలిచిపోయింది. గండిపడి పదిరోజులవుతున్నా ఇప్పటికి నీటిని మళ్లించే పనుల నత్తనడకన సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.30లక్షల నుంచి రూ.40లక్షల ఖర్చుతో చేపడుతున్న పనులు పూర్తి కాలేదు. ఆ పనులు పూర్తయితే తప్ప గండి పడిన ప్రదేశాన్ని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు వీలు కుదరదు. అప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తిని పునఃప్రారంభించడానికి వీలుకాదు. భారీ ప్రమాదం జరిగినప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతున్నా ఇప్పటి వరకు జెన్‌కోలోని డైరెక్టర్ స్థాయి అధికారులు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నత్తనడకన సాగుతున్న నీటి మళ్లింపు పనులు
లీకేజీతో పనులకు ఆటంకం...
సీలేరు విద్యుత్ కాంప్లెక్సు డొంకరాయి జలవిద్యుత్ కేంద్రం పైభాగంలో జలాశయానికి ఆనుకుని మూడు గేట్లతో శాడిల్ డ్యాం ఉంది. జలాశయంలో పూర్తిగా నీటిమట్టం చేరి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయని సమయంలో ఈ గేట్లను ఎత్తి పవర్ కెనాల్ ద్వారా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేస్తారు. ప్రస్తుతం పవర్ కెనాల్‌కు గండి పడడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినా శాడిల్ డ్యాం గేట్లు లీకేజీల కారణంగా రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు పవర్ కెనాల్‌కు వస్తోంది. దీంతో ఆ నీటిని తగ్గించేందుకు ఇప్పటికే అండర్ వాటర్ సర్వీస్ ద్వారా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలీకృతం కావడం లేదు. శాడిల్ డ్యాం గేట్ల రబ్బర్ సీల్స్ నాణ్యమైనవి కాకపోవడమే దీనికి కారణం. అప్పటి అధికారుల కమీషన్ల కోసం చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ఇపుడు అది పెద్ద ప్రమాదంగా మారింది.
డైవర్షన్ పనులకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తోంది. లీకవుతున్న నీరు రెండు అడుగుల మేర రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పవర్ కెనాల్ కుడి ఎడమ గట్టు పరిస్థితి ప్రమాదంగా ఉందని, దాన్ని పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలని ఏడాదిన్నర కిందట పవర్ కెనాల్ ఏఈ.. చీఫ్ ఇంజినీర్‌కు లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టులపై డైరెక్టర్ స్థాయి అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, పది రోజులు గడిచినా తాత్కాలికంగా నీటిని మళ్లించే పనులు జరగకపోతే గండి పడిన ప్రదేశాన్ని పూడ్చేందుకు ఎన్నిరోజులు పడుతుందోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఎందుకింత నిర్లక్ష్యం..
ఏపీ జెన్‌కో సీలేరు విద్యుత్ కాంప్లెక్సులోని పలు శాఖల ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే తాజా ప్రమాదానికి కారణం. పవర్ కెనాల్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి దాన్ని మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. కుడి, ఎడమల కాలువల మరమ్మతులు చేపట్టారే తప్ప నీరు ప్రవహిస్తున్న 14 కిలోమీటర్ల అడుగుభాగం ఎలా ఉందని ఇప్పటి వరకు స్థానిక అధికారులు పరిశీలించలేదు. అడుగు భాగం 15మీటర్ల వరకు చొచ్చుకుపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. దీంతో ప్రస్తుతం నీటి మళ్లింపు ఖర్చు, పనుల ఖర్చు, గండి పడిన ప్రదేశంలో నిర్మాణం చేపట్టడంతో పాటు గత పదిరోజులుగా రెండు విద్యుత్ కేంద్రాల్లో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి కారణంగా ప్రభుత్వానికి కోట్ల రూపాయల భారీ నష్టం తప్పలేదు. దీనికి స్థానిక అధికారులే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment