సాక్షి, గుంటూరు: నగర ప్రజలు పన్నులు చెల్లించకపోతే నానా రభస చేసే నగర పాలక సంస్థ అధికారులు మూడేళ్లగా గ్రంథాలయ సంస్థకు సెస్సు చెల్లించడం లేదు. ఎన్నిసార్లు గుర్తు చేసినా కాలయాపన చేస్తున్నారే తప్ప పట్టుమని పది లక్ష లు కూడా జమ చేయడం లేదు. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థ పరిస్థితి దయనీయంగా మారింది. ఏం చేయాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేక గ్రంథాలయ సంస్థ అధికారులు అన్ని విధాలా అగచాట్లు పడుతున్నారు.
నగరవాసులు చెల్లించే ఇంటి పన్నుల్లో రూపాయికి 8 పైసలు చొప్పున కార్పొరేషన్ జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లిం చాలి. ఉదాహరణకు ఇంటిపన్ను రూపేణా రూ.100 లు వసూలైతే అందులోని రూ.8 లను విధిగా లైబ్రరీ సెస్ కిం ద గ్రంథాలయ సంస్థకు కార్పొరేషన్ అధికారులు జమ చేయాలి. ఏటా ఇంటి పన్నుల రూపేణా రూ.45 కోట్లు వసూలవుతుంది. ఇందులో రూ.3.60 కోట్లు సెస్ కింద గ్రంథాలయ సంస్థకు చేరాలి. అయితే ఆరేళ్ల నుంచి ఇది జమ కావడం లేదు.
ఈ బకాయిల మొత్తం రూ. 15 కోట్లు దాటింది. ఇలాగైతే కష్టమని గ్రంథాలయ సంస్థ అధికారులు నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ ఐదారు లక్షలు విదిలించి కార్పొరేషన్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక గ్రంథాలయ సంస్థ కార్యదర్శి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
నిలిచిపోయిన చెల్లింపులు... జిల్లాలోని మున్సిపాల్టీలు, గుంటూరు కార్పొరేషన్ నుంచి అందే సెస్ గ్రంథాలయ సంస్థకు ప్రధాన ఆదాయ వనరు. సెస్ చెల్లింపులో మున్సిపాల్టీలు కూడా పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల నుంచి సుమారు రూ.20 కోట్ల వరకు గ్రంథాలయ సంస్థకు జమ కావాల్సి ఉంది. మున్సిపాల్టీల నుంచి సెస్ చెల్లింపులు ఆగిపోవడంతో రెండేళ్లుగా గ్రంథాలయ సంస్థ ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతింది.
కొత్త పుస్తకాల కొనుగోలు, కరెంటు బిల్లుల చెల్లింపులు, దిన, వార పత్రికలకు నె లవారీ బిల్లుల చెల్లింపులు, లైబ్రరీ భవనాల రిపేర్లు వంటి పనులన్నింటికీ డబ్బులు లేక అధికారులు నానా ఇక్కట్లు పడుతున్నారు. రోజువారీ పనులు నిర్వహణకు అవసరమైన గుండుసూదులు, ఫైళ్లు, గమ్‌బాటిళ్లు, స్టాంప్ ప్యాడ్లు, ట్యాగ్‌ల కొనుగోళ్లకు సైతం పైసా లేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. గుంటూరు నగరంతో పాటు జిల్లా అంతటా ఉన్న 150 మంది బుక్ డిపాజిట్ సెంటర్స్ నిర్వాహకులకు నెలవారీగా అందజేసే హానరోరియంలు ఆగిపోయాయి.
అలాగే గ్రామీణ గ్రంథాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులకు చెల్లింపులు నిలిచిపోయాయి. చాలా చోట్ల లైబ్రరీల్లో దిన, వార పత్రికలు పడటం లేదు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొంతలో కొంతైనా సెస్‌ను జమ చేస్తే బాగుంటుందని గ్రంథాలయ సంస్థ అధికారులు ఆశాభా వాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్ నుంచి చెల్లింపులు : కమిషనర్
ఏప్రిల్ నెల నుంచి విధిగా గ్రంథాలయ సెస్‌ను ఆ సంస్థకు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్ కె. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు.
కార్పొరేషన్ నిర్లక్ష్యం...లైబ్రరీలకు శాపం
Published Sat, Jan 18 2014 2:42 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement
Advertisement