
ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిందే
బుచ్చిరెడ్డిపాళెం: ప్రజలను మోసం చేసి గెలిచినంత మాత్రాన సరిపోదని, ఎన్నికల్లో ప్రకటించిన వాగ్దానాలను అమలు చేయాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరె డ్డిపాళెం, కోవూరు, కొడవలూరు తహశీల్దార్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ధర్నాల్లో ఎంపీ మేకపాటి మాట్లాడారు.
బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ నెరవేర్చలేని వాగ్దానాలు చేయకూడదన్నారు. ఆ విధంగా ఆ పార్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫైళ్లపై సంతకాలు చేసి, నేటి వరకు అమలు చేయకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, నిరుద్యోగ భృతి రూ.2వేలు, ఇంటికో ఉద్యోగం అంటూ వాగ్దానాలు గుప్పించి , నేడు ప్రజా జీవితంతో ఆడుకోవడం సమంజసం కాదన్నారు.
అధికారం కోసం హామీలు ప్రకటించి, ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు దాటినా వాటిని అమలుచేయక పోవడం సబబు కాదన్నారు. ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేయకూడదనే తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు రుణమాఫీ ప్రకటించలేదన్నారు. పలువురి ఆర్థిక శాస్త్రవే త్తలను సంప్రదించి, అమలు చేయలేమని నిర్ణయించిన తరువాతే రుణమాఫీ ప్రక టించలేదన్నారు.
తాను మేధావినని, ఆర్థిక శాస్త్రవేత్తనని చెప్పుకునే చంద్రబాబు నాడు రుణమాఫీ ప్రకటించి, నేడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి ధాటికి తట్టుకోలేరన్న విషయం చంద్రబాబుకు తెలిసి కేవలం అధికారం కోసమే మోసపూరిత వాగ్దానాలు చేశారన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబునాయుడు రోజుకో వాగ్దానం చేస్తున్నాడన్నారు. చేసిన వాగ్దానాలు మరచి రాజధాని పేరుతో ప్రజలకు రంగుల ప్రపంచాన్ని చూపుతున్నాడని ఆరోపించారు. ప్రజలకు ముందు ఎన్నికల్లో ప్రకటించిన హామీలు నెరవేర్చాలని ఆయన కోరారు.
చంద్రబాబు మోసగాడు :
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
ప్రజలను మోసం చేసి సీఎం అయిన చంద్రబాబు మోసగాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. ఊసరవెల్లిలా రంగులు మార్చి ప్రజలను నమ్మించి మోసం చేశాడన్నారు. అన్ని రకాల వ్యాపారులు కోటీశ్వరులవుతున్న తరుణంలో అందరికీ తిండి పెట్టే ధాన్యం పండించే రైతన్నలు దిక్కులేని వారవుతున్నారన్నారు.
చంద్రబాబునాయుడ్ని నమ్మినందుకు అన్నదాతలు బాధపడుతున్నారన్నారు. పేదలు కూడా ఉన్నత విద్య చదవాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారన్నారు. ఇదేం న్యాయమని అడిగితే విద్యార్థులని చూడకుండా పోలీసులచే చితకబాదించాడన్నారు. అన్ని వర్గాల ప్రజలు నమ్మి చంద్రబాబునాయుడికి ఓటేస్తే నేడు వారందరినీ విస్మరించి నయవంచకుడిగా మారాడన్నారు. దాదాపు 200 వాగ్దానాలు చేశాడని, ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేద న్నారు.
ప్రజలను మోసం చేయాలని చూస్తే తిరగబడతారని, తిరగబడితే సీఎం కుర్చీ కూడా ఉండదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రకటించిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన కోరారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ శేషుశ్రీలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో పేర్కొన్న విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఎంపీ, జిల్లా అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సూరా శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు జయరామయ్య కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు నరసింహరావు, కొండారెడ్డి, నాయకులు కలువ బాలశంకర్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, షేక్ అల్లాబక్షు, షేక్ కరీముల్లా, బొంతా హరిబాబుయాదవ్, బిట్రగుంట నారాయణ, రవికుమార్, విద్యార్థి విభాగం నాయకుడు షేక్ కరీముల్లా, యామాల మోహన్, మాల్యాద్రియాదవ్ పాల్గొన్నారు.