కలకలం రేపిన చంద్రబాబు వ్యాఖ్యలు
120 ఏళ్ల చరిత్ర కలిగిన సీఐఐని ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలు
విస్మయం వ్యక్తం చేస్తున్న పారిశ్రామికవేత్తలు
సోషల్ మీడియాలో వ్యంగ్యచిత్రాలతో ఎద్దేవా చేస్తున్న నెటిజన్లు
తనను తాను పొగుడుకోవడం కోసం సీఐఐని తక్కువ చేయడం సరికాదంటూ హితవు
సాక్షి, అమరావతి: దేశ పారిశ్రామికాభివృద్ధి కోసం 120 ఏళ్లుగా విశేష కృషి చేస్తున్న కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ)పై సీఎం చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 1991లో దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల్లో కీలకపాత్ర పోషించిన సీఐఐని పట్టుకొని.. తాను గతంలో సీఎంగా పనిచేసినప్పుడు సీఐఐ చిన్న సంస్థ అని, దాన్ని తానే ప్రమోట్ చేశానని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తనను తాను పొగుడుకోవడం కోసం ఇతర సంస్థల స్థాయిని తగ్గిస్తూ మాట్లాడటం తగదని సీఐఐ ఏపీ చాప్టర్‌కి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి ఒకరు ముఖ్యమంత్రికి హితవు పలికారు.
మరోవైపు సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్య చిత్రాలతో విరుచుకుపడుతున్నారు. త్వరలో ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయాన్ని సైతం అమరావతికి తీసుకొచ్చేస్తారంటూ సోషల్‌మీడియాలో పలువురు చేస్తున్న పోస్టులు వైరల్ అయ్యాయి. విశాఖలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగిన భాగస్వామ్య సదస్సు ముగింపు సందర్భంగా సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో సంస్కరణలకు తాను ఆద్యుడినని, సీఐఐని తానే ప్రమోట్ చేశానని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దావోస్‌ను అమరావతికే తీసుకొస్తానని సీఎం చెప్పడంతో పారిశ్రామికవేత్తలు నోరెళ్లబెట్టారు. ఒక ముఖ్యమంత్రి ఈవిధంగా మాట్లాడుతుంటే.. ఏమనాలో అర్థం కావడం లేదన్నారు.
సీఐఐ అనేది కేవలం కంపెనీలు, కార్పొరేట్ సంస్థల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కోసం పనిచేసే స్వతంత్ర సంస్థ. అటువంటి సంస్థకు కూడా ఇప్పుడు సీఎం రాజకీయరంగు పులిమారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే సీఐఐ ప్రతినిధులను పక్కన పెట్టుకొని రాజకీయ విమర్శలు చేశారు. దీంతో వేదికపై ఉన్న సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ రమేష్ దాట్ల ఇబ్బందికి గురయ్యారు. దీన్ని గమనించిన సీఎం వారిని వెళ్లిపొమ్మని చెప్పారే గానీ.. రాజకీయ విమర్శలు మాత్రం ఆపలేదు.
సీఐఐది 120 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర..
ఐదు ఇంజనీరింగ్ తయారీ సంస్థలతో 1895లో ఇంజనీరింగ్ అండ్ ఐరన్ ట్రేడ్స్ అసోసియేషన్‌గా సీఐఐ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత 1912లో ఇండియన్ ఇంజనీరింగ్ అసోసి యేషన్, 1942లో ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా పేర్లు మార్చుకుంది. అప్పటివరకు కేవలం బ్రిటిష్ కంపెనీల కోసమే పనిచేసిన ఈ సంస్థ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్‌గా రూపాంతరం చెందింది.
ఆ తర్వాత 1986లో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ (సీఈఐ)గా జాతీయ స్థాయిలో సేవలందించింది. 1991 వరకు ఇంజనీరింగ్ రంగానికే పరిమితమైన ఈ సంస్థ.. 1992లో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ)గా మారింది. ప్రస్తుతం సీఐఐలో 8,000 మందికి ప్రత్యక్ష సభ్యత్వముండగా, పరోక్షంగా 2 లక్షల సంస్థలకు సభ్యత్వముంది. అలాగే సీఐఐ మొత్తం 64 కార్యాలయాలను కలిగి ఉండగా ఇందులో తొమ్మిది సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలు, విదేశాల్లో 8 చోట్ల కార్యాలయాలున్నాయి.