
‘ఆప్’ రాకతో సామాన్యుడిలో కొత్త ఆశలు
నాగేశ్వర్, చుక్కా రామయ్య
ఢిల్లీలో విజయంపై ఆప్ రాష్ర్ట శాఖ విజయోత్సవం
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలంటే తప్పుడు అభిప్రాయంతో ఉన్న సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కొత్త ఆశలు రేకెత్తించిందని ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఏవీ కాలేజ్ ప్రాంగణంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ప్రసగించారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాల విషయంలో ఆప్ అనుసరించిన ధోరణి ప్రశంసనీయమని నాగేశ్వర్ అన్నారు. ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఢిల్లీ మాదిరిగా ఏపీలో కూడా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని ఈ విషయంలో ఆ పార్టీకి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
వ్యాపారమయమైన రాజకీయాలను మార్చడం కోసం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రయత్నం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ప్రశంసించారు. అవినీతికి తావులేకుండా, స్వచ్ఛమైన రాజకీయాలు కష్టమనుకుంటున్న తరుణంలో కేజ్రీవాల్ వాటిని నిజం చేసి చూపించారని, దేశవ్యాప్తంగా ఇలాంటి రాజకీయ వాతావరణం రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆప్‌లో చేరారు. కార్యక్రమంలో ఆప్ రాష్ట్రశాఖ నేతలు ప్రొఫెసర్ ఆర్.రమేష్‌రెడ్డి, హర్షద్ హుస్సేన్, సి.వినోద్‌కుమార్, థామస్, అజిత్‌సింగ్, శ్రీలక్ష్మి, బి.సాయిలు తదితరులు పాల్గొన్నారు.