మార్కాపురం, న్యూస్‌లైన్:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న నిర్మల్ భారత్ అభియాన్(వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం) ముందుకు సాగడం లేదు. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెడతామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో శ్రద్ధ చూపడం లేదు. నిధులున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తగిన ప్రచారం లేకపోవడం, ఇచ్చే నిధుల కంటే నిర్మాణ వ్యయం ఎక్కువ కావడం, ఉపాధి హామీ పథకానికి లింక్ పెట్టి జాబ్‌కార్డు ఉంటేనే నిధులిస్తామని చెప్పడం, నిర్మించిన వాటికి నిధులు ఇవ్వకపోవడంతో పథకం అమలు అధ్వానంగా మారింది. కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులను పరుగులు పెట్టిస్తున్నప్పటికీ లక్ష్య సాధన కష్టమైంది. నిధులుండి కూడా లబ్ధిదారులకు సకాలంలో ఉపాధి హామీ సిబ్బంది నిధులు చెల్లించకపోవడంతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఈ పథకంలో నిర్మించుకునే మరుగుదొడ్డికి 10,200 కాగా, కేంద్రం 4,800, రాష్ట్ర ప్రభుత్వం 4,500, లబ్ధిదారుని వాటాగా 900 నిర్ణయించారు. తెల్లరేషన్ కార్డు ఉండి ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్నట్లయితే నగదును ప్రభుత్వం దశలవారీగా లబ్ధిదారునికి అందజేస్తుంది. వీటి బాధ్యతను ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకం సిబ్బందికి కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 30వ తేదీ నాటికి 56 మండలాల్లో 2,01,982 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా 62,225 పూర్తయ్యాయి. 50,432 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అర్ధవీడులో 3602కు గానూ 1422, బేస్తవారిపేటలో 4084కు గానూ 1568, దర్శిలో 5157కు గానూ 1423, దోర్నాలలో 4065కు గానూ 1235, గిద్దలూరులో 4012కు గానూ 1563, కొనకనమిట్లలో 5306కుగానూ 1060, మార్కాపురంలో 3529కు గానూ 1127, పెద్దారవీడులో 4483కుగానూ 1417, పొదిలిలో 4255కు 1425, పుల్లలచెరువులో 3576కు 1466, రాచర్లలో 2779కు 915, తర్లుపాడులో 3317కు 1027, యర్రగొండపాలెంలో 4729కి 1521 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యాయి.
జిల్లా అధికారులు ఈ పథకాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో కలిపి కేంద్రం అమలు చేస్తున్న నిర్మల్ భారత్ అభియాన్ కింద నిధులను అందిస్తున్నారు. నిబంధనల ప్రకారమే ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి * 12,500 ఖర్చవుతుంది. నిర్మాణ వ్యయం ఎక్కువ కావడం, ప్రభుత్వం ఇచ్చే నిధులు తక్కువ కావడంతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. గ్రామస్థాయికి వెళ్లి నిర్మాణంలో ఉన్న సమస్యలపై అధికారులు తెలుసుకోకుండా తమకు లక్ష్యాలు కేటాయించి ఎందుకు పూర్తి చేయలేదంటూ చిర్రుబుర్రులాడటంపై కిందిస్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలల నుంచి మార్కాపురం ప్రాంతంలో ఈ పథకం కింద నిర్మించుకున్న మరుగుదొడ్ల బిల్లులు చెల్లించకపోవడంతో కొత్తగా నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. మొదటి దశలో గుంత తీసినందుకు, రెండో దశలో రింగ్‌లు వేసినందుకు, ఆ తరువాత నిర్మాణం పూర్తి కాగానే లబ్ధిదారులకు నిధులు చెల్లిస్తారు. మొత్తం మీద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిదానంగా సాగుతోంది.
పూర్తయినా బిల్లులు రాలేదు
కాశీరత్తమ్మ, జమ్మనపల్లి, మార్కాపురం మండలం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుని రెండు నెలలైంది. బిల్లులు రాలేదు. అధికారులను అడిగితే ఇస్తామని చెబుతున్నారు. మా గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకుని బిల్లులు రాని వారు సుమారు 20మంది వరకు ఉన్నారు. వెన్నా రమణారెడ్డి, బొర్రయ్యలు మరుగుదొడ్లు నిర్మించుకున్నా బిల్లులు రాలేదు.
వారంలో చెల్లిస్తాం
పోలప్ప, డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో బిల్లుల చెల్లింపులో కొద్దిగా జాప్యం జరిగింది. పోస్టాఫీసు ఖాతాల ద్వారా లబ్ధిదారులకు వారం రోజుల్లో నిధులను చెల్లిస్తాం. పోస్టల్ అధికారులతో మాట్లాడాం. ఆందోళన చెందాల్సిన పని లేదు.