ప్రధాన కాలువ.. పారేదెలా! | No modernization development to canal | Sakshi
Sakshi News home page

ప్రధాన కాలువ.. పారేదెలా!

Published Sun, Nov 17 2013 4:49 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

No modernization development to canal

నిజాంసాగర్, న్యూస్‌లైన్:   నిజాంసాగర్ ప్రాజెక్టు చివరాయకట్టుకు సాగునీరు అందడం కలగానే మిగులుతోంది. ఏళ్లు గడుస్తున్నా ప్రధాన కాలువ ఆధునికీకరణ పనుల్లో పురోగతి లేకపోవడమే ఇందుకు కారణంగా రైతులు ఆవేదన చెందుతున్నారు. నిధులు ఉన్నా నిష్ర్పయోజనంగా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నిజాం కాలంలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ బలహీనంగా మారింది. కాలువ గట్టుకు ఏర్పాటు చేసిన   బండరాళ్లు అక్కడక్కడా తొలగిపోయాయి. ప్రాజెక్టు నిర్మించిన సమయం లో 3 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా 155 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువను బలపర్చారు.

అయితే ఎప్పటికప్పుడు సరైన మరమ్మతులు చేయని కారణంగా క్రమక్రమంగా  కాలువ నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 1,800 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని కూడా తట్టుకోలేక పోతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన ప్రతిసారి ఎక్కడో ఒకచోట గండ్లు పడుతూ వేలాది ఎకరాలకు అందాల్సిన సాగు నీరు వృథా అవుతోంది. చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు చేరడం లేదు.
 ప్రధాన కాలువ ఈ దుస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ఆధునికీకరణ పనుల కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008-09లో రూ. 549.5 కోట్లను మంజూరు చేశారు. ఆధునికీకరణ కోసం వచ్చిన నిధులను జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు 15 ప్యాకేజీలుగా విభజించారు. రెండు ప్యాకేజీలు మాత్రం ప్రాణహిత చేవెళ్ల పథకం పనుల్లోకి వెళ్లగా 13 ప్యాకేజీల్లో ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. అయితే పనులు అనుకున్నంత మేర సాగడం లేదు. అన్ని ప్యాకేజీల్లో ప్రధాన కాలువకు సిమెంట్ లైనింగ్ చేయాల్సి ఉంది. కాగా 1,2, ప్యాకేజీలతో పాటు మరికొన్ని ప్యాకేజీల్లో సిమెంట్ లైనింగ్ పనులు ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు.
 ఆయా ప్యాకేజీల్లో కట్టబలోపేతం, ముళ్ల పొదల తొలగింపు పనులు ఆసంపూర్తిగానే ఉన్నాయి. మిగతా ప్యాకేజీల్లో సుమారు 4 నుంచి 6 కిలోమీటర్ల మేర సిమెంట్ లైనింగ్ పనులు మాత్రం జరిగాయి. ఆయా ప్యాకేజీల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు మాత్రం రూ. 250 కోట్ల మేర డబ్బులు చెల్లించారు. ఇదిలా ఉండగా ప్రస్తుత రబీ సీజన్‌లో చివరి ఆయకట్టు వరకు రైతన్నలు పంటల సాగు కోసం సమాయత్తమవుతున్నారు. ప్రధాన కాలువ మొదటి ఆయకట్టు ప్రాంతంలో పటిష్టంగా లేకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరందడం కష్టంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement