
సాక్షి, ఒంగోలు: మాట్లాడితే దేశంలో అత్యంత సీనియర్ నేతనని చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సభలో మైక్ తీసుకొంటే చాలు అడ్డూ అదుపు లేకుండా ప్రసంగిస్తారు. రోటీన్‌గా సాగే ఆయన ప్రసంగం సభికులకు నచ్చకపోయినా.. వారికి అర్థం కాకపోయినా.. ఆయన ధోరణిలో మాత్రం మార్పు ఉండదు. సభలో ప్రజలు ఉన్నారో.. వెళ్లిపోతున్నారా? అన్నది కూడా పట్టించుకోకుండా ఆయన ప్రసంగపాఠంలో మునిగిపోతారు. తాజాగా ఒంగోలు జిల్లా పర్యటనలో భాగంగా మార్టూరులో జరిగిన గ్రామదర్శిని సభలో చంద్రబాబు ప్రసంగించారు.
ఇక్కడ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు కానీ.. ప్రజలు మాత్రం హాజరుకాలేదు. సభకు చంద్రబాబు ఆలస్యంగా రావడం సభలో చాలావరకు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో కొద్దిమంది మాత్రమే సభలో ఉన్నారు. అయినా చంద్రబాబు యథారీతిలో తనకు తెలిసిన ప్రజాస్యామ్య పాఠాలు వల్లే వేశారు. ఒకవైపు పెద్దసంఖ్యలో ఉన్న ఖాళీ కుర్చీలు ఉన్నా.. చంద్రబాబు తనదైన ధోరణిలో ప్రసంగించుకుంటూ పోయారు. ఈ సభకు సంబంధించి ఖాళీ కుర్చీలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తున్న వీడియోను స్థానిక యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.