ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య ఐఆర్‌పై తేలని చర్చ
అవసరమైతే ఆందోళన చేపడతామని ఉద్యోగుల హెచ్చరిక
ఆర్థిక మంత్రి వద్ద అసంపూర్తిగా ముగిసిన చర్చలు
నేడు ఉదయం సీఎం వద్ద సమావేశం..
22 శాతం ఇచ్చినా ఖజానాపై రూ. 6,259 కోట్లు భారం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్)పై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఉద్యోగ సంఘాల మధ్య బుధవారం జరిగిన చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. 22 శాతం ఐఆర్ ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆర్థిక మంత్రి చేసిన ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు అంగీకరించలేదు. ‘‘నేను సున్నా నుంచి ప్రారంభించలేదు. 17 శాతం ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి సహకరిస్తుంది. దానికి అంగీకరించండి’’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు. చివరికి.. 22 శాతం ఇవ్వడానికి మంత్రి అంగీకరించారు. అంతకు మించి ఇచ్చే అధికారం ఆర్థిక మంత్రిగా తనకు లేదని.. ముఖ్యమంత్రి సమక్షంలోనే తేల్చుకోవాలని సూచించారు. 22 శాతం ఐఆర్ ఇచ్చినా.. రాష్ట్ర ఖజానాపై ఏటా రూ. 6,259 కోట్ల భారం పడుతుందని ఆనం తెలిపారు.
అయితే తొలుత 45 నుంచి 50 శాతం ఐఆర్ ఇవ్వాల్సిందేనని ప్రకటించిన ఉద్యోగ సంఘాలు.. చర్చల సందర్భంగా కాస్త మెత్తబడి 32 శాతానికి దిగాయి. కానీ, అంతకన్నా తక్కువగా ఇస్తామంటే అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పడంతో.. చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో ఐఆర్‌పై చర్చ ముఖ్యమంత్రి వద్దకు చేరింది. గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్ద ఉద్యోగ సంఘాలతో చర్చలు జరగనున్నాయి. ఇందులో తుది నిర్ణయం తీసుకొనే అవకాశముంది. నూతన సంవత్సర కానుకగా ఐఆర్ ఇస్తామని గత వారమే ఉద్యోగ సంఘాలకు సీఎం హామీ ఇచ్చారు. కానీ ఐఆర్ ప్రకటన రాకుండానే ఉద్యోగులు నూతన సంవత్సరంలో అడుగుపెట్టారు. గురువారం జరిగే చర్చల్లోనైనా ఉద్యోగులు సంతృప్తి చెందే విధంగా ఐఆర్ ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు. ఒకవేళ 32 శాతానికి ప్రభుత్వం అంగీకరించకుంటే.. ఆందోళనకు దిగుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.
22% ఇస్తాం.. 32% ఇవ్వాల్సిందే..
Published Thu, Jan 2 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement