వచ్చే ఏడాది గడువు ముగిసే పదవులకు ఇప్పుడే పొడిగింపు ఇస్తున్న సర్కారు
సాక్షి, హైదరాబాద్: ఒక పక్క రాష్ట్ర విభజనకు రంగం సిద్ధమవుతుండగా మరో పక్క ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పాలనాపరమైన నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇప్పుడు దృష్టి సారించింది. అలాగే వచ్చే ఏడాది పదవీ కాలం ముగియనున్న నామినేటెడ్ పోస్టుల్లోని అధికారుల పదవీ కాలం గడువును ఇప్పుడే పెంచడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కమిషనర్ ఆఫ్ ఇంక్వైరీస్‌లో పనిచేస్తున్న ముగ్గురు సభ్యుల పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముగుస్తుండగా ఇప్పుడే వారి పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది.
ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన కె. సహదేవరెడ్డిని 2012 మార్చి 2న కమిషనర్ ఆఫ్ ఇంక్వైరీస్‌లో సభ్యునిగా నియమించింది. సహదేవరెడ్డి పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 1తో ముగియనుంది. అయితే ఆయన పదవీ కాలాన్ని 2014 మార్చి 2 నుంచి మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కమిషనర్ ఆఫ్ ఇంక్వైరీస్‌లో సభ్యులుగా ఉన్న పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ప్రేమ్‌చంద్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అలోక్ శ్రీవాత్సవ పదవీ కాలం వచ్చే ఫిబ్రవరి 28న ముగుస్తోంది. దీంతో వీరి పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి 1 నుంచి మరో రెండేళ్ల పాటు పొడిగించారు. కొన్ని ట్రస్టులకు, పాలనపరమైన సంస్థల్లోని నామినేటెడ్ పదవులపై ప్రభుత్వం ఇప్పుడే నిర్ణయాలను తీసుకుంటోంది.