'30కాదు 70 మంది గుడ్బై చెబుతారు'
విజయవాడ : రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ విభజన జరిగితే కాంగ్రెస్ నుంచి 30మంది కాదని, 70మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్నారు. అంతే కాకుండా 10 లేదా 12మంది కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు హస్తానికి చేయిస్తారన్నారు.
జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఈ సందర్భంగా లగడపాటి రాజగోపాల్ సమర్థించారు. జేసీ వ్యాఖ్యలో పార్టీ నాశనం అవుతుందన్న ఆవేదన ఉందన్నారు. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ వ్యవహారం తనకు తెలియదని లగడపాటి దాటవేశారు. ఆయన తన మాటల్లో నాయకత్వాన్ని మార్చాలని పరోక్షంగా తెలిపారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరపాల్సిందేనని లగడపాటి డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి 30మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నిన్న వెల్లడించిన విషయం తెలిసిందే.