ట్రాక్ మరమ్మతులు చేస్తున్న రైల్వే సిబ్బంది
టంగుటూరు: మండల పరిధిలోని టి.నాయుడుపాలెం సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయిల్ ట్యాంకర్ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి 58 ట్యాంకర్లతో కడప వెళుతున్న గూడ్స్ రైలు 580 ఎగువ రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే పట్టాలు తప్పింది. మొత్తం ఏడు ట్యాంకర్లు పట్టాలు తప్పగా నాలుగు ట్యాంకర్లు బ్రిడ్జి కింద పడి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి దగ్ధమయ్యాయి. ఈ సంఘటన జరిగిన ప్రాంతం నుంచి ఐఓసీ లే అవుట్ పక్కనే ఉండటంతో భయాందోళన నెలకొంది. మంటలు క్రమం క్రమంగా పెద్దవి కావడంతో స్థానిక గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న ఐఓసీ రెస్క్యూ టీం, సౌత్ సెంట్రల్ రైల్వే రెస్క్యూ టీం, రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
ప్రమాదం ఎలా జరిగింది..
ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే అడిషనల్ ఆర్‌ఎం రామరాజు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంజినీరింగ్ బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కమిటీ వేశామని, వారం రోజుల్లో నివేదిక వస్తుందని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం మూడవ రైల్వే నిర్మాణ పనుల వల్ల భూమి కుంగి రైలు పట్టాలు తప్పినట్లు భావిస్తున్నామన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. మిగిలిన 50 ట్యాంకర్లను టంగుటూరుకు చేర్చామన్నారు. గురువారం ఉదయం 300 మంది కార్మికులు మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు. సంఘటనా స్థలాన్ని రైల్వే అధికారులు, ఒంగోలు డీఎస్పీ ప్రసాద్, సింగరాయకొండ సీఐ శ్రీనివాసులు, ఎస్సై రమణయ్యలు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment