పింఛన్ల జాబితా నుంచి తమ పేరు తొలిగింపునకు గురైందన్న ఆవేదనలో మూడురోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధ దంపతుల్లో భర్త ఆదివారం మృత్యువాత పడ్డాడు.
గుంతకల్లు: పింఛన్ల జాబితా నుంచి తమ పేరు తొలిగింపునకు గురైందన్న ఆవేదనలో మూడురోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధ దంపతుల్లో భర్త ఆదివారం మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన శ్రీనివాసులు దంపతులు కొన్నేళ్లుగా ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్ ఆధారంతోనే జీవిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే పింఛన్లలో భారీ కొతలు విధించిన సంగతి తెలిసిందే. అలా పింఛన్ల జాబితాలో తమ పేర్లు తొలిగింపునకు గురవ్వడంతో మనస్థాపం చెందిన శ్రీనివాసులు దంపతులు శుక్రవారం గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు.
స్థానికులు వారిని ఆసుపత్రిలో చేర్పించగా, పరిస్థితి తీవ్రత దృష్ట్యా వారిని కర్నూలు పెద్దాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, చికిత్స పొందుతూ శ్రీనివాసులు ఈ రోజు ఉదయం మృతిచెందాడు. అతని భార్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. కర్నూలు ఆసుపత్రికి చేరుకున్న గుంతకల్లు పోలీసులు.. వివరాలను సేకరించి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.