‘తొమ్మిదిన్నర ఏళ్ల మీ తండ్రి పాలనలో పింఛన్ రూ.75 ఇచ్చేవారు... కొత్తగా ఎవరికైనా పింఛన్ ఇవ్వాలంటే ఒక పింఛన్‌దారు చనిపోవలసిందే.
జగ్గంపేట : ‘తొమ్మిదిన్నర ఏళ్ల మీ తండ్రి పాలనలో పింఛన్ రూ.75 ఇచ్చేవారు... కొత్తగా ఎవరికైనా పింఛన్ ఇవ్వాలంటే ఒక పింఛన్‌దారు చనిపోవలసిందే. వైఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా అర్హులందరికి రూ.200 పింఛన్ ప్రతినెలా 1న జీతం మాదిరిగా ఇచ్చా రు. ఇది మరచి ప్రస్తుతం రూ.1000 పింఛన్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తగదు’ అంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు జిల్లా పరిషత్ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్‌కుమార్ హితవు పలికారు. మంగళవారం జగ్గంపేట బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లోకల్ ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ప్రశ్నించడంపై బుధవారం నవీన్ విలేకరుల సమావేశంలో ప్రతిస్పందించారు.
స్థానిక జేవీఆర్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో నవీన్ మాట్లాడుతూ ఎన్నికల్లో డ్వాక్రా, రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ఇచ్చిన హామీలపైనే నెహ్రూ ప్రశ్నించారన్నారు. 18 నెలల పాలనలో రూ.1.15 లక్షల కోట్లకు గాను ఎంత రుణమాఫీ చేశారని ప్రశ్నించారు. తన తండ్రి జ్యోతుల నెహ్రూ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అధికారంతో నిమిత్తం లేకుండానే నియోజకవర్గ అభివృద్ధికి పోరాడి నిధులు సాధించారని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజ మెత్తారు. పార్టీ నాయకులు బుర్రి సత్తిబాబు, రేకా బులిరాజు, జేమ్స్, గోపి పాల్గొన్నారు.