
పొలాల్లో పరుగులు.. గన్‌తో కాల్పులు..!
పాలకొండలో గురువారం మధ్యాహ్నం ఒడిశా పోలీసులు హల్‌చల్ చేశారు. దొంగతనం కేసులో నిందితులను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నం
పాలకొండ/పాలకొండ రూరల్: పాలకొండలో గురువారం మధ్యాహ్నం ఒడిశా పోలీసులు హల్‌చల్ చేశారు. దొంగతనం కేసులో నిందితులను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నం సినీపక్కీని తలపించింది. పాలకొండ శివారులో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. దొంగలను వెంబడిస్తూ పొలాల్లో పరిగెత్తిన ఒడిశా పోలీసులు కాల్పులుకు తెరతీయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏమి జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
పాలకొండ సమీపంలో ఉన్న ఎన్‌కేరాజపురం వద్ద నంబరు లేని తెల్లని స్కార్పియోతో 9 మంది బృందం ఆగింది. వీరిని చూసి అక్కడ సంచరిస్తున్న ఐదుగురు వ్యక్తులు పరుగులు పెడుతున్నారు. వారి వెనకే వాహనంలో వచ్చిన వారు గన్‌లు పట్టుకుని వెంబడించారు. అంతా కలసి ఎన్‌కేరాజపురం వెనుక ఉన్న పంట పొలాల్లోకి పరుగులు తీశారు. ఈ సమయంలో బృందంలోని సభ్యులు గన్‌లు ఓపెన్‌చేసి పట్టుకోగా ఒకరు కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ముందు పరిగెడుతున్న ఐదుగురిని 9 మంది బృందం పట్టుకుని వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. వాహనం వద్దకు చేరుకుని గ్యాంగ్‌స్టర్‌లుగా అనుమానించి వాహనాన్ని కదలనివ్వలేదు. మీరంతా ఎవరూ? కాల్పులు ఎందుకు జరిపారని ప్రశ్నించారు. దీనిపై బృందం సభ్యులు తాము ఒడిశా పోలీసులమని.. దొంగలున్నారన్న సమాచారంతో దాడులు జరిపి పట్టుకున్నామని చెప్పారు. పోలీసులకు యూనిఫాం, ఐడీ కార్డులు లేకపోవడంతో స్థానికులు వారిని విడిచి పెట్టేందుకు ఒప్పుకోలేదు.
అనంతరం స్థానిక పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో సీఐ ఎం.చంద్రశేఖర్, ఎస్సై ఎల్.చంద్రశేఖర్ వీళ్లను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. ఒడిశా పోలీ సుల వద్ద ఉన్న ఆయుధాలు తీసుకుని ప్రశ్నిం చారు. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ ఖాన్‌తో సంప్రదించి ఒడిశా ప్రాంతం రాయఘడకు చెందిన పోలీసులుగా నిర్ధారించారు. తర్వాత సీఐ, ఎస్సైల సమక్షంలో వారిని రెండు వాహనాలలో రాయఘడ తరలించారు. ఎంతమంది వచ్చారో..: అసలు ఒడిశా నుంచి పాలకొండ వచ్చిన దొంగల ముఠా ఎంత మందో అనేది స్పష్టంగా తెలియరాలేదు. పదులు సంఖ్యలో వచ్చారని కొంత మంది.. కేవలం ఐదుగురు మాత్ర మే వచ్చారని వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే మరో ఇద్దరు తప్పించుకున్నారన్న వదంతులు స్థాని కంగా కలకలం రేపాయి.
భయంభయం..: గతంలో ఎప్పుడూ గన్ పేలుళ్లు, పోలీసులు హడావిడి చూడని ఈ ప్రాంత ప్రజలు ఒకేసారి కాల్పులు జరగడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాలకొండ సమీపంలో కాల్పులు జరిపారన్న వార్త దావాలంలా మండలం అం తా వ్యాపించింది. సు మారు రెండు కోట్ల రూ పాయల డబ్బు సంచులతో దొంగలు దొరికారంటూ వదంతులు రావడంతో ఎత్తున ప్రజ లు సంఘటనా స్థలం తో పాటు పోలీసు స్టేషన్‌ను చుట్టు ముట్టారు. స్థానిక, ఒడిశా పోలీసులు దొంగలను రెండు వాహనాలలో తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.