పాల్వంచ, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమం.. కేటీపీఎస్ కేంద్రం గా పాల్వంచలో పురుడు పోసుకుందని, అది 1969లో ఉవ్వెత్తున ఎగిసిపడిందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పా రు. పాల్వంచలోని జెన్కో గెస్ట్‌హౌస్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర అధికారుల పెత్తనం, ఇక్కడి ప్రజలపట్ల వివక్ష, చులకన భావం సహించలేని ఈ ప్రాంత ప్రజలు, ఉద్యోగులు ఆనాడు తిరుగబాటు చేశారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు కిందిస్థాయి ఉద్యోగుల విషయంలో ఆంధ్ర అధికారుల పక్షపాత వైఖరిలో మార్పు రావడం లేదని అన్నారు.
ఉన్నతస్థాయి పదవులన్నింటినీ సీమాంధ్రులే చేజిక్కించుకుని నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తున్నారని, కిందిస్థాయి ఉద్యోగుల బతుకులు ఛిద్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ ఉద్యోగాలలో కేవలం 21శాతం మాత్రమే ఇక్కడి వారు ఉన్నారని, మిగతా వాటిని ఆంధ్ర వారితో భర్తీ చేశారని చెప్పారు. ఇకపై తెలంగాణ వారికే ఉద్యోగోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బదిలీల ప్రక్రియ చేపట్టాలని, అప్పుడు ఎక్కువ శాతం మంది ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని అన్నారు. విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును ఇక్కడి ప్రాంతానిదే వాడాలని, తద్వారా ఉత్పత్తి ఖర్చు కూడా తగ్గుతుందని అన్నారు. నాణ్యమైన బొగ్గు లభ్యమవుతున్నందున ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరిగే అవకాశముందని అన్నారు. ఇక్కడి వనరులను ఉపయోగించే విద్యుత్ ప్లాంట్లను నడపాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో నిర్మాణంలోగల కేటీపీపీ 2వ దశ, జూరాలలో హైడల్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని; ప్రతిపాదనలోగల కేటీపీఎస్ 7వ దశ, కేటీపీపీ 3వ దశను; రామగుండం, సత్తుపల్లి, నేదునూరు. శంకర్‌పల్లిలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.
అనంతరం, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్(టీవీఈఏ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం.నెహ్రూ, ఎన్.భాస్కర్ మాట్లాడుతూ.. 610 జీఓ ప్రకారం జెన్కోలో 42 శాతం ఉండాల్సిన తెలంగాణ ఎగ్జిక్యూటివ్ కేడర్లలో కేవలం 17 శాతం మాత్రమే ఉన్నామని అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులను బదిలీ చేసి, ఖాళీ అయిన ఆ స్థానాలను తెలంగాణ వారితో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం, పది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కోదండరామ్‌కు ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యోగ జేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు, అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ తిరుమలరావు, జె న్కో టీజేఏసీ కన్వీనర్ డి.సంజీవయ్య, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు ఎం.బాలరాజు, కె.మధుబాబు, ఎ.జగదీష్, సిహెచ్.కన్నయ్య. వి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమానికి.. పురిటిగడ్డ పాల్వంచ
Published Thu, Nov 7 2013 5:19 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement