పంచాయతీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Published Thu, Jan 2 2014 3:29 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ను కలెక్టర్ సిద్ధార్థ జైన్ విడుదల చేశారు. గతేడాది జూలై నెలలో 23, 27, 31వ తేదీల్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే. అప్పట్లో 884 పంచాయతీల ఎన్నికలకు జిల్లా యంత్రాంగ నోటిఫికేషన్ ఇచ్చింది. కాగా మొగల్తూరు మండలం మోడీ (అన్‌రిజర్వుడ్), పోలవరం మండలం పైడిపాక(ఎస్టీ), టి.నర్సాపురం మండలం మర్రిగూడెం(ఎస్సీ మహిళ) గ్రామాల్లో పాలకవర్గ ఎన్నికలకు ఎవ్వరు నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో 881 గ్రామాల్లోనే ఎన్నికలు జరిగాయి. ఇదే సందర్భంలో 17 గ్రామాల్లో 20 వార్డు పదవులకు ఎవ్వరు నామినేషన్ దాఖలు చేయలేదు. అదే విధంగా పెదవేగి మండలం పెదకడిమి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు కాలేదు. ఉంగుటూరు మండలం తల్లాపురం సర్పంచ్‌గా ఎన్నికైన మద్దూరి చినరామ సోమయాజి శాస్త్రి 15 రోజుల తర్వాత ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఈ పదవి ఖాళీ అయ్యింది. ఎన్నికలు జరిగిన 6 నెలల్లోగా ఖాళీ అయిన పదవులను ఉప ఎన్నికల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి భర్తీకి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జిల్లాలో ఉప ఎన్నికలకు బుధవారం కలెక్టర్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు డీపీవో పోలింగ్, సిబ్బంది ఏర్పాట్లును పూర్తి చేస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇలా...
ఈ నెల 3 నుంచి 6వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఆయా గ్రామాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లును స్వీకరిస్తారు. 10వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, 16వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారానికి గడువు ఇచ్చారు. 18న ఉదయం 7 నుంచి 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేస్తామని డీపీవో అల్లూరి నాగరాజు వర్మ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
Advertisement