అసలు పోరు మొదలైంది
అసలు పోరు మొదలైంది
Published Sun, Apr 13 2014 1:31 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియకు తెరలేవడంతో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల హడావుడి మొదలవడంతో పార్టీల్లో ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులెవరు, గెలిచే అవకాశం ఎవరికి ఉంటుందనే విషయాలపై గ్రామాలు, పట్టణాల్లో ఎడతెగని చర్చలు నడుస్తున్నాయి. మునిసిపల్, స్థానిక ఎన్నికల పోలింగ్ సరళి తమకు కలిసొచ్చేలా లేదని తెలియడంతో తెలుగుదేశం పార్టీ కొంత వెనక్కి తగ్గింది. ఓటింగ్ సరళి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరుగుతుందనే విష యం స్పష్టమవడంతో టీడీపీ నేతలు అయోమయంలో పడ్డారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ప్రకారం ముందుకెళుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన శనివారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నామినేషన్లు వేశారు.
పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తోట గోపి నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన నియోజకవర్గాల నేతలు కూడా నామినేషన్ల దాఖలుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో ఆ పార్టీలో కోలాహలం నెలకొంది. టీడీపీ నేతల్లో గందరగోళంటీడీపీలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇంకా నాన్చుడు ధోరణి అవలంభిస్తుండడంతో నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి రెండో జాబితాలో ఐదుగురు అభ్యర్థిత్వాలను మాత్రమే ఖరారు చేశారు. నిడదవోలుకు బూరుగుపల్లి శేషారావు, తణుకుకు ఆరిమిల్లి రాధాకృష్ణ, పోలవరానికి మొడియం శ్రీనివాస్, ఏలూరుకు బడేటి బుజ్జి, దెందులూరుకు చింతమనేని ప్రభాకర్‌ను ఎంపిక చేశారు. మిగి లిన 10 నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం బీజేపీకి వదిలేయగా, తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు.
వలస నేతల టెన్షన్
ఇతర పార్టీల్లోంచి టీడీపీలోకి వెళ్లిన వలస నేతలు నేటికీ సంకటస్థితిని ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు ఆచంట ఖరారైనట్లు ప్రచారం జరిగినా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గుబ్బల తమ్మ య్య ఎదురుతిరగడంతో వివాదం నెల కొంది. దీంతో పితాని పరిస్థితి అయోమయంలో పడింది. కాంగ్రెస్ నుంచి వెళ్లిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబును స్థానిక నేతలు వ్యతిరేకిస్తుండడంతో అక్కడా ఏంచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఆ సీటు ఆశించిన మెంటే పార్థసారథి వర్గం అధినేత ఎదుట బలనిరూపణ చేసేం దుకు రాజధానికి వెళ్లింది. ఉండి స్థానం మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సిట్టింగ్ ఎమ్మెల్యే కలవపూడి శివ మధ్య దోబూచులాడుతోంది. కొవ్వూరు, గోపాలపురం, చింతలపూడి, నరసాపురం, ఉంగుటూరు నియోజకవర్గాలను ఎవరికిస్తా రనే దానిపైనా స్పష్టత రాలేదు. దీంతో టీడీపీ నేతలెవరికీ సీటు ధీమా కనిపిం చడం లేదు. తమ పేర్లు జాబితాలో ఉంటాయో లేదోననే ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది. ఈ కారణంగానే నేతలు నామినేషన్ల గురించి ఆలోచించే పరి స్థితి లేకుండాపోయింది.
Advertisement
Advertisement