
తిరుపతి, సాక్షి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తిరుపతిలో రెండో రోజు జరుగుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలవద్దకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజల కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాన్ని అందరికి వివరించే బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. రానున్నది వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వమేనని, ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని అన్నారు. వైఎస్ జగన్ ప్రతి ఒక్కరినీ గుర్తిస్తారని కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామంద్రారెడ్డి, కాకాని గోవర్దన్ రెడ్డి, ఆర్. రోజా, భూమన కరుణాకర్ రెడ్డి పాల్లొన్నారు.