♦గ్రూపు తగాదాలు లేవని చెప్పలేం
♦సమన్వయంతో ముందుకు వెళ్లాలి
♦కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయబోం
♦జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు
కర్నూలు : పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్నూలు శివారులోని ఎంఆర్‌సీ కన్వెన్షన్‌లో టీడీపీ జిల్లా నూతన అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన పార్టీ మినీ మహానాడు నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బలహీనవర్గాల ఆశాజ్యోతి దివంగత కె.ఇ.మాదన్న వర్ధంతిని పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు సభలో రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో మహానాడు ప్రారంభమయ్యింది. ముఖ్య అతిథిగా అచ్చెన్నాయుడు ప్రసంగించారు.
టీడీపీలో గ్రూపు తగాదాలు లేవని చెబితే అవివేకమే అవుతుందని, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులకు, ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి మధ్యలో సమస్యలు ఉన్నాయన్నారు. వీరంతా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ జెండా మోసినవారికి కాకుండా వలస నేతలకే పదవులు దక్కుతున్నాయన్న అసంతృప్తి వీడాలని సూచించారు. కార్యకర్తల మనోభావాలకు దెబ్బతీయబోమని, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని త్వరలో డీలర్‌షిప్‌లను కూడా భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రసంగించారు.
ఇతర నేతలు ఏమన్నారంటే..
పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇతర పార్టీ నాయకులకే పనులు జరుగుతున్నాయని బనగానపల్లె ఎమ్మెల్యే బి.సి.జనార్దన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వలస నేతలకే పదవులు దక్కుతున్నాయని తన క్లాస్ మేట్ మీనాక్షి నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఎమ్మెల్యే పదవులు కూడా రొటేషన్ పద్ధతిలో కార్యకర్తలకు ఇస్తే బాగుంటుందని మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ అభిప్రాయపడ్డారు.
తాను అందరికంటే పాత కార్యకర్తనని, ఒకరినొకరు నిందించుకుంటూ పోతే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని మాజీ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ అన్నారు. మినీ మహానాడులో ప్రత్యేకంగా జిల్లా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయాల్సిన అవసరం లేదని, ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే చాలని మాజీ మంత్రి కె.ఇ.ప్రభాకర్ తెలిపారు.
సైడ్‌లైట్స్..
మహానాడు ప్రారంభానికి ముందే నంద్యాల ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి సభలో నుంచి వెళ్లిపోయారు. పార్టీ కండువాను మెడలో వేసేందుకు ఒక నాయకుడు ప్రయత్నించగా వద్దని వారించి కండువాను తన కుర్చీ ముందున్న టీపాయిపై ఉంచి సభలో నుంచి నిష్ర్కమిం చారు. అలాగే తన ఉపన్యాసం పూర్తి కాగానే టి.జి.వెంకటేష్ సభ నుంచి వెళ్లిపోవడం కార్యకర్తల్లో చర్చనీయాంశ మయ్యింది.
పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా పనిచేస్తా
పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా పని చేస్తూ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి హామీ ఇచ్చారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు పార్టీ బాధ్యతలను శిల్పాకు అప్పగించారు. రాష్ట్ర పార్టీ నుంచి పంపిన పత్రాన్ని చదివి శిల్పాచక్రపాణిరెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ మాజీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచనలు, సలహాలతో డిప్యుటీ సీఎం కె.ఇ.కృష్ణమూర్తి, ఇన్‌చార్జి మంత్రి అచ్చన్నాయుడు ఆశీస్సులతో పార్టీని పటిష్టపరుస్తూనే జిల్లా అభివృద్ధి కోసం పాటు పడతానని హామీ ఇచ్చారు. తనపై గురుతర బాధ్యతతో జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టినందుకు నారా లోకేష్‌కు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ పటిష్టతే లక్ష్యం
Published Sun, May 24 2015 5:15 AM | Last Updated on Wed, Aug 29 2018 7:50 PM
Advertisement
Advertisement