మానవతా దృక్పథంతో ప్రాణాలకు తెగించి మరీ తోటివారిని కాపాడడానికి ముందుకు ఉరికివస్తారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో కూడా ఓ వ్యక్తి అలాగే తెగించాడు.
అనంతపురం : పెను ప్రమాదం జరిగినప్పుడు చాకచక్యంగా స్పందించేవారు కొందరుంటారు. మానవతా దృక్పథంతో ప్రాణాలకు తెగించి మరీ తోటివారిని కాపాడడానికి ముందుకు ఉరికివస్తారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో కూడా ఓ వ్యక్తి అలాగే తెగించాడు. తన జీవన సహచరి కళ్ల ముందు సజీవ దహనమైనా కన్నీటిని దిగమింగుకుంటూ తోటి ప్రయాణికులను కాపాడడంలో మునిగిపోయాడు శ్రవణ్ అనే ప్రయాణికుడు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో శ్రవణ్ భార్య, అత్త, మావయ్య అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. ఆ బాధను భరిస్తూనే అతడు... 20 మంది ప్రయాణికులను రక్షించాడు. చాకచక్యంగా వ్యవహరిస్తూ వారందరినీ ప్రమాదం నుంచి తప్పించాడు. అయితే కట్టుకున్న భార్యను.. వికలాంగుడైన ఆమె తండ్రిని మాత్రం కాపాడలేకపోయాడు. భార్యను కాపాడుకోలేకపోయాను గానీ.. దాదాపు 20 మంది ప్రాణాలను మాత్రం కాపాడగలిగానంటూ కన్నీంటి పర్యంతమయ్యాడు.
అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 23మంది సజీవ దహనం కాగా, 15మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. క్షతగాత్రులు ధర్మవరం, పుట్టపర్తి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బీ1 ఏసీ బోగీలో 57మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.