ఉద్యోగుల గుండెల్లో  ప్రైవేట్‌ రైళ్లు | Passengers Get Fear For Indian Railway Privatization | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల గుండెల్లో  ప్రైవేట్‌ రైళ్లు

Published Sun, Jan 19 2020 6:55 PM | Last Updated on Sun, Jan 19 2020 8:51 PM

Passengers Get Fear For Indian Railway Privatization - Sakshi

సాక్షి, విశాఖపట్నం: భారతీయ రైలు ప్రైవేటు పట్టాలెక్కేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ రైళ్ల పరుగు మొదలవడం ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతోంది. తాజాగా విశాఖ నుంచి, విశాఖ మీదుగా కూడా ప్రైవేట్‌ రైళ్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనలు సిద్ధమవుతుండటంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవి పూర్తిగా అమల్లోకి వస్తే సామాన్యుడికి రైలు ప్రయాణం దూరమవుతుందని, దీన్ని మొదట్లోనే బ్రేక్‌ వెయ్యకపోతే రైల్వే ఉద్యోగుల భద్రత ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రైల్వేల నిర్వహణను ప్రైవేటుకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా చర్యలు చేపడుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రైల్వేలను ప్రైవేటుపరం చేయబోతున్నట్లు చేసిన ప్రకటన కూడా గుబులు రేపుతోంది. 

తేజస్‌తో శ్రీకారం
ఇప్పటికే తేజస్‌ రైళ్లను ప్రవేశపెట్టారు. ఏసీ బోగీలు, విలాసవంతమైన సౌకర్యాలతో నడిచే ఈ రైళ్లను ఆయా జోన్లలో ప్రారంభించేందుకు ఐఆర్‌సీటీసీ సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా 100 మార్గాలను తొలిదశలో ఎంపిక చేసిన రైల్వే బోర్డు.. విశాఖ మీదుగా 9 ప్రైవేట్‌ రైలు సర్వీసులను ప్రతిపాదించింది. ఇందులో రెండు రైళ్లు విశాఖపట్నం నుంచి విజయవాడ, తిరుపతిలకు పరుగులు తియ్యనున్నాయి. మరో ఏడు రైళ్లు ఇతర ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా వెళ్లనున్నాయి. ప్రైవేట్‌ రైలు సర్వీసులకు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వరకూ ఒక క్లస్టర్‌గా విభజించారు. సగటున 65 కిమీ వేగంతో గంటకు 200 నుంచి 300 కిమీ వేగంతో ప్రయాణించేలా ఈ ప్రైవేటు రైళ్లు రానున్నాయి. విశాఖ–విజయవాడ, విశాఖ–తిరుపతి, చర్లపల్లి–శ్రీకాకుళం తదితర సర్వీసులు రానున్న రెండు మూడేళ్లలో ప్రారంభం కానున్నాయి.
చదవండి: ప్రయాణీకులకు షాకిచ్చిన ఐఆర్‌సీటీసీ

2015లోనే బీజం...
రైల్వేల్లో సంస్కరణల పేరుతో 2015లో ప్రైవేటు ఆలోచనకు బీజం పడింది. క్రమంగా ఒక్కో అవరోధాన్ని తొలగించుకుంటూ తేజస్‌ రైలును ఇటీవలే పట్టాలెక్కించారు. రైల్వేలు ప్రయాణికులనే కాకుండా సరకు రవాణా చేస్తుంటాయి. అలాంటి రైల్వేలు ప్రైవేటు పరమైతే ఛార్జీల మోత మోగిపోతుంది.

సామాన్యుడికి దూరం కానున్న ప్రయాణం
166 ఏళ్లుగా భారత ప్రజలకు సేవలందిస్తున్న భారతీయ రైల్వే వ్యవస్థ ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే సామాన్యుడికి రైలు ప్రయాణం దూరం కానుందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. సాధారణంగా ఒక రైలులో రెండు నుంచి నాలుగు జనరల్‌ బోగీలుంటాయి. దీనికితోడు స్లీపర్‌ క్లాస్‌ బోగీలుంటాయి. ప్రతి రైలులోనూ జనరల్‌ బోగీలు కిక్కిరిసి ఉంటాయి. ఒక బోగీలో 72 మంది ప్రయాణించే సౌకర్యం మాత్రమే ఉన్నా.. 150 మంది వరకూ వెళ్తుంటారు. కానీ తేజస్‌ రైలులో స్లీపర్‌ క్లాస్‌ గానీ, జనరల్‌ బోగీ గానీ కనిపించవు. అంటే ఇవి సామాన్య ప్రయాణికులకు అందుబాటులో ఉండవన్నది స్పష్టం. దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని.. ఈ నేపథ్యంలో రైల్వేలను ప్రైవేట్‌ పరం చేస్తే సహించేందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
చదవండి: పట్టాలెక్కనున్న మరో తేజాస్‌ ట్రైన్‌

ఇది దురదృష్టకరం
రైల్వే వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం చాలా దురదృష్టకరం. తమకు నచ్చిన ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లను పెంచిపోషించేందుకు చేస్తున్న ప్రయత్నమిది. దీని వల్ల ఉద్యోగ భద్రత ఉండదు. చాలా మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆదాయం వస్తున్నా.. రైల్వేలను ప్రైవేటుపరం చెయ్యడం సరికాదు. దీనిపై కేంద్రం పునరాలోచించుకోవాలి. 
–  డా.పి రాజశేఖర్, జాయింట్‌ సెక్రటరీ, ఆల్‌ ఇండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement