
విశాఖలో వాహనం దిగకుండానే లాంగ్ మార్చ్ చేస్తున్న పవన్‌కల్యాణ్
సాక్షి, విశాఖపట్నం: భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇసుక సమస్యపై పోరాటంలో భాగంగా విశాఖ నగరంలోని మద్దిలపాలెం జంక్షన్ నుంచి వీఎంఆర్‌డీఏ సెంట్రల్ పార్క్ వరకు జనసేన నిర్వహించిన లాంగ్‌మార్చ్‌లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అనంతరం సెంట్రల్ పార్క్ సమీపంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. జనాలు ఇళ్లు వదిలి రోడ్డెక్కారంటే ప్రభుత్వం సరిగా పని చెయ్యనట్లేనని పవన్ విమర్శించారు. ఏడాది వరకూ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు, పోరాటాలు చెయ్యనని అనుకున్నాననీ, అయితే భవన నిర్మాణ కార్మికులను పట్టించుకోకపోవడంతో కవాతు చెయ్యాల్సి వచ్చిందన్నారు.
ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలవుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్‌లైనా లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రెండు వారాల్లో స్పందించి.. ఇసుక సరఫరాపై సరైన నిర్ణయం తీసుకోవడంతో పాటు, ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ.50 వేల పరిహారం, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 5లక్షలు చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. తనపై నమ్మకం లేకపోవడం, అనుభవం లేదనే కారణంతో తన అభిమానులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని పవన్ కల్యాణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, పార్టీ నాయకులు నాగబాబు, నాదెండ్ల మనోహర్‌తో పాటు, టీడీపీ మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
సభలో అపశృతి...
పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. కవాతు ప్రారంభమైన మద్దిలపాలెం జంక్షన్ వద్ద జరిగిన తోపులాటలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ త్రిమూర్తులకు స్వల్పగాయాలయ్యాయి. సభా ప్రాంగణం వద్ద విద్యుదాఘాతం సంభవించి నలుగురు గాయపడ్డారు. వీరిలో రమణారెడ్డి అనే యువకుడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. అందరూ సురక్షితంగా ఉన్నారు.
పేరు లాంగ్ మార్చ్.. వాహనంపై నుంచే అభివాదం
ఇసుక కొరతపై జనసేన నిర్వహించే లాంగ్ మార్చ్‌లో 2.5 కి.మీ. వరకు పవన్ కల్యాణ్ నడుస్తారని ముందుగా ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. కానీ. పవన్ మాత్రం నడవకుండా వాహనం పైన నిలబడి అభివాదం చేశారు. దీనిపై ఆ పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి నెలకొంది.