- 6,791 మంది హాజరు
నెల్లూరు(టౌన్) : సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ అర్హత విద్యనభ్యసించేందుకు అవసరమైన డీఈఈ సెట్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నెల్లూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కలిపి మొత్తం 31 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. గంటముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి గుంపులు, గుంపులుగా చేరుకున్నారు. తమకు కేటాయించిన గదిని చెక్‌చేసుకుంటూ కనిపించారు. అయితే చివరి 5 నిమిషాల్లో ఒకరిద్దరు హడావుడిగా కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్ష ముగిసింది. మొత్తం 7341 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 550 మంది గైర్హాజరయ్యారు. మిగిలిన 6,791 మంది పరీక్షలు రాశారు. విద్యార్థిని, విద్యార్దులకు సహాయకులుగా వారి తల్లిదండ్రులు, సోదరులు వచ్చి పరీక్ష పూర్తయ్యే వరకు చెట్లకింద గడిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.
పరీక్ష కేంద్రాల తనిఖీ
పరీక్ష కేంద్రాలను డీఈఓ ఉష తనిఖీ చేశారు. నగరంలోని దర్గామిట్టలో ఉన్న జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, సెయింట్ జోసఫ్, ఎస్‌ఆర్‌కే, ఎస్‌కేడీ, రత్నం తదితర పలు పాఠశాలలో ఉన్న పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు, ఇన్విజిలేటర్లకు సూచనలు చేశారు.
ప్రశాంతంగా డీఈఈ సెట్
Published Mon, Jun 16 2014 2:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement