రాష్ట్ర ప్రభుత్వం మళ్లీమాట మార్చింది.. | peoples are concern on loan waiver | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వం మళ్లీమాట మార్చింది..

Published Wed, Dec 31 2014 12:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రాష్ట్ర ప్రభుత్వం మళ్లీమాట మార్చింది.. - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం మళ్లీమాట మార్చింది..

రాష్ట్ర ప్రభుత్వం మళ్లీమాట మార్చింది. తొలి దశలో రైతుల రుణమాఫీ విషయమే ఓ కొలిక్కిరాలేదు ... రెండో దశలో  ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి వ్యవహరించడంతో కుడితిలో పడ్డ ఎలుకలా బ్యాంకర్లు గిలగిలా కొట్టుకుంటున్నారు. మాఫీ హామీ నెరవేర్చలేక చతికిలపడి అభాసుపాలైన సర్కారు బ్యాంకర్లదే తప్పంటూ కొత్త పల్లవి అందుకొని పక్కకు తప్పుకునే ప్రయత్నం చేయడంతో ఇటు రైతుల్లోనూ, అటు బ్యాంకర్లలోనూ గందరగోళం నెలకొంది.
 
ఒంగోలు:  మొదటి దశ రుణమాఫీ జాబితాలో పేర్లు లేని రైతులు ఆందోళన చెందవద్దు ... రెండో దశ జాబితా ఉంది ... అందులో మీ అందరికీ మాఫీ అవుతాయి ... ఇందుకోసం మీరు మళ్లీ సంబంధిత ధ్రువీకరణ పత్రాలు ఇవ్వనవసరం లేదు ... అన్నీ బ్యాకర్లే చూసుకుంటారు... వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేస్తారంటూ చెప్పిన చంద్రబాబు సర్కారు మళ్లీ మాట మార్చడంతో అయోమయ పరిస్థితి నెలకుంది.

సాంకేతిక కారణాలతో ఈ సమస్య తలెత్తిందని, అభ్యంతరాలు సరిచేసి జనవరి 10వ తేదీన వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు ప్రభుత్వం తొలుత ప్రకటించడంతో మాఫీ కోసం ఎదురుచూసే రైతన్నలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రకటన మీద నిలబడకుండా సర్కారు మళ్లీ కుప్పిగంతులేస్తోంది. అన్ని ధ్రువీకరణ పత్రాలతోపాటు జన్మభూమి కమిటీ ఓకే చేయాలని కొత్త ముడి వేయడంతో  బ్యాంకర్లలో గందరగోళం నెలకుంది.  

విధానమంతా అయోమయం
రుణమాఫీకి సంబంధించి మొత్తం మూడు విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. వాటిలో మొదటి దశలో రుణమాఫీకి అర్హుల జాబితాను సూచించారు. రెండో దశలో అండర్ ప్రాసెస్ అంటూ సూచించారు. వాటికి సంబంధించి  జనవరి 10వ తేదీన రుణమాఫీ వెబ్‌సైట్‌లో పేర్కొంటున్నట్లు ప్రకటించింది. రైతులు ఎవరైనా ఆందోళన వ్యక్తం చేస్తే వారివద్ద నుంచి ఎటువంటి ఫిర్యాదులను స్వీకరించవద్దంటూ బ్యాంకర్లకు సూచించారు.

నేడు తీరు మారింది. తాజాగా రుణమాఫీ వెబ్‌సైట్ సూచనల ప్రకారం రెండో దశలో ఉన్నవారి వివరాలు గందరగోళంగా ఉన్నాయని, తిరిగి వాటిని లోడ్ చేసి పంపించాలంటూ బ్యాంకర్లను ఆదేశించింది. దీంతో తిరిగి ఖాతాదారులకు సమాచారం ఎలా పంపాలి, ఎప్పటిలోగా వివరాలు అప్‌లోడ్ చేయాలి బాబోయ్ అంటూ జుత్త పీక్కుంటున్నారు. దీనికితోడు వచ్చిన అభ్యంతరాలను తప్పనిసరిగా జన్మభూమి కమిటీలు ధ్రువీకరించిన తరువాతే పంపాలని మరో మెలిక పెట్టారు.  గ్రామ కమిటీలకు పంపేది ఎప్పుడు? వారు ధ్రువీకరించేది ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు బ్యాంకర్లు. ఈ తంతంగమంతా జనవరి 8వ తేదీలోగా పూర్తిచేయాలి.

ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించిన దానిప్రకారం 10వ తేదీన రెండో దశలో అర్హులైన వారి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ప్రస్తుత పరిస్థితినే పరిశీలిస్తే జిల్లాలో తొలి విడతలో 3,29,167ఖాతాలకు సంబంధించి దాదాపు రూ.370 కోట్ల రుణాలను రదు ్దచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో కొంతమందిని అనర్హుల జాబితాలో చేర్చారు. దీంతో వారు తమకు అన్ని అర్హతలున్నా .. ఎందుకు అనర్హుల జాబితాలో చేర్చారంటూ బ్యాంకర్లను నిలదీయడం ప్రారంభించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అటువంటి వారి వివరాలను తమకు పంపిస్తే పరిశీలించి న్యాయం చేస్తామంటూ ప్రకటించారు.

ఈ మేరకు బ్యాంకర్లు ఖాతాదారులనుంచి వివరాలు సేకరించి పంపేందుకు సిద్ధమయ్యారు. రుణమాఫీ వెబ్‌సైట్ మాత్రం తొలిదశలో తిరస్కరించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు సిద్ధంగా లేదు.  దీంతో తప్పులు దొర్లడానికి కారణం బ్యాంకర్లేనంటూ రెవెన్యూ అధికారులు, టీడీపీ నేతలు అంటుండగా బ్యాంకర్లు మాత్రం తాము వివరాలను సక్రమంగానే పంపామని, జన్మభూమి కమిటీల ద్వారా స్వీకరించిన సమాచారం సరిగా లేకపోవడం వల్లే తప్పులు దొర్లాయంటూ ఆక్షేపిస్తున్నారు. మీ వాదనలు కాదు... మా పరిస్థితి ఏమిటంటూ మరోవైపు రైతులు నిలదీస్తున్న ఘటనలు జిల్లాలో నెలకొంటున్నాయి.

బ్యాంకుల ముందు ధర్నాలు చేయండి ... నిలదీయండి
ఒక పక్క రైతు రుణమాఫీకి సంబంధించి ఎక్కడైనా తప్పులు దొర్లితే అందుకు బ్యాంకర్లదే బాధ్యతంటూ సీఎం ప్రకటిస్తున్నారు. అక్కడితో ఆగకుంగా రుణం చెల్లించాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి చేస్తే బ్యాంకుల ముందు ధర్నాలు చేయండి, వారి చొక్కాలు పట్టుకోండంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలపై కూడా బ్యాంకర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే విశాఖపట్నానికి చెందిన బ్యాంకర్ల సంఘం స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జిల్లాలోని బ్యాంకర్లు ఆచితూచీ అడుగేస్తున్నారు.  రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా బ్యాంకర్లు ఇప్పటివరకు వ్యక్తిగత రుణ ఖాతాలకు జమ చేయకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement