బాంబు కలకలం
►తిరుమల, తిరుపతిలో విస్తృత తనిఖీలు
►పరుగులు తీసిన పోలీసులు
►భద్రత కట్టుదిట్టం
సాక్షి, తిరుమల/తిరుపతి క్రైం: ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో బాంబు ఉందనే సమాచారంతో కలకలం రేగింది. దీనికితోడు రాష్ట్ర డీజీపీ కార్యాలయం, ఇంటెలిజెన్స్ విభాగాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో, తిరుపతి అలిపిరి వద్ద అన్ని భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి. మధ్యాహ్నం నుంచి పోలీసులు, టీటీడీ విజిలెన్స్, ఎస్‌పీఎఫ్, ఏఆర్ పోలీసులు వారివారి పరిధిలో భద్రతను కట్టుదిట్టంచేశారు. మూడు బృందాలుగా విడిపోయి బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు ఆలయం, రద్దీ ఉండే అన్ని అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి.
వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లే భక్తులను రెట్టింపు స్థాయిలో తనిఖీ చేసి అనుమతించారు. మరోవైపు సీసీ కెమెరాల్లో నిఘా ఉంచారు. అనుమానిత వ్యక్తుల కదలికలను నిశితంగా పరిశీలించారు. ప్రధానమైన తిరుమల టోల్‌గేట్, తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్, టీటీడీ వసతి గృహాలు, ప్రముఖ దేవాలయాల్లో బాంబు స్క్వాడ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. టోల్‌గేట్ వద్ద వచ్చే వాహనాలను, యాత్రికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించి తిరుమలకు అనుమతించారు. కార్ల బ్యానెట్ సైతం తెరచి డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ చేయించారు.దీంతో తిరుమలకు ప్రయాణించే భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అన్ని చోట్లా వెతికినా ఏమీ దొరక్కపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ముక్కంటి చెంత
శ్రీకాళహస్తి: తిరుపతిలోని అలిపిరి వద్ద బాంబులు ఉన్నట్లు పుకార్లు రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు ముక్కంటి చెంత పోలీసులు గురువారం రాత్రి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ వెంకటకిషోర్ నేతృత్వంలో వన్ టౌన్ సీఐ చిన్న గోవింద్, ఎస్‌ఐ ఏటీ.స్వామి పోలీసులు భక్తులను రాత్రి 7 నుంచి 9-30 గంటల వరకు విస్తృతంగా తనిఖీ చేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నామని.... ఆందోళన చెందాల్సిన అవసరంలేదని డీఎస్పీ వెంకటకిషోర్ స్పష్టం చేశారు.
ఇంటెలిజెన్స్ అధికారుల అదుపులో అనుమానితులు
బాంబు ఉందంటూ పుకార్లు రావడంపై తిరుపతి ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆరాతీశారు. ఫోన్ కాల్స్ ఆధారంగా కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.